రిపబ్లిక్ టివి సర్వే నమ్మొచ్చా ? నెలన్నరలో ఎంత మార్పు

వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్లమెంటు ఎన్నికలపై రిపబ్లిక్ టివిలో తాజాగా వచ్చిన సర్వే పై అంతటా అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, వైసిపి స్ధానాల సంఖ్య భారీగా తగ్గిపోయి కాంగ్రెస్ కూటమికి స్దానాల షేర్ పెరగటమే అనుమానాలకు కారణం. ఇప్పటి వరకూ జాతీయ మీడియాలో చాలా సంస్ధలు సర్వే అంచనాలను ఇచ్చాయి. కానీ ఏ సర్వే నివేదికపైనా ఎవరికీ అనుమానాలు రాలేదు. ఇప్పుడు మాత్రం సర్వేపై ఎందుకు అనుమానాలు మొదలయ్యాయి ? ఎందుకంటే, దాదాపు ఇదే సంస్ధ నెలన్నర క్రితం ప్రకటించిన సర్వే ఫలితాలకు తాజా ఫలితాలకు చాలా వ్యత్యాసం ఉంది కాబట్టే.

 

పోయిన సర్వే ఫలితాల్లో వైసిపి రిపబ్లిక్ టివి 20 ఎంపి స్ధానాల్లో తిరుగులేదని ప్రకటించింది. వైసిపి ఓట్ షేర్ 43.6 శాతంగా చెప్పింది. టిడిపికి కేవలం 5 సీట్లు మాత్రమే దక్కుతాయని జోస్యం కూడా చెప్పింది. టిడిపి ఓటు షేర్ 33.6 శాతంగా తేల్చింది. అటువంటిది తాజా సర్వే ఫలితాల్లో వైసిపి 14 ఎంపి సీట్లు మాత్రమే దక్కుతాయని చెప్పటం గమనార్హం. అదే సమయంలో కాంగ్రెస్ కూటమికి అంటే కాంగ్రెస్, టిడిపిలు కలిపి 11 ఎంపి సీట్లు దక్కించుకుంటాయని కూడా చెప్పింది.

 

ఇక్కడే రిపబ్లిక్ టివి సర్వే అంచనాలపై అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే రెండు సర్వే వివరాలను వెల్లడించటానికి మధ్య కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలేమీ లేవు. జగన్ పై పెరిగిన వ్యతిరేకతా లేదు, చంద్రబాబునాయుడుపై పెరిగిపోయిన సానుకూల పరిణామాలూ ఏమీ లేవన్న విషయం అందరికీ తెలిసిందే. మరటువంటపుడు వైసిపికి సీట్లు ఎలా తగ్గుతాయో, అదే సమయంలో కాంగ్రెస్ కూటమికి సీట్లు ఎలా పెరుగుతాయో రిపబ్లిక్ టివియే చెప్పాలి. పైగా కాంగ్రెస్ తో టిడిపి పొత్తు ఇంకా ఖరారు కూడా కాలేదు. రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుంటే ఏం జరిగిందో తెలంగాణాలో అందరూ చూసిందే. అందుకనే ఏపిలో పొత్తులు పెట్టుకునే విషయంలో రెండు పార్టీల నేతల్లోను భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

ఏపిలో రెండు పార్టీల మధ్య పొత్తులు పొడవకపోయినా రిపబ్లిక్ టివి మాత్రం పొత్తులు కుదిర్చేసింది. పైగా ఏపిలో టిడిపి పెద్ద పార్టీ అన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఏపిలో పోయిన ఎన్నికల్లో నేలమట్టమైపోయింది. అంటే ఇచ్చే స్దితిలో టిడిపి, పుచ్చుకునే స్దితిలో కాంగ్రెస్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.  అయినా టివి ఛానల్లో మాత్రం కాంగ్రెస్ కూటమి అంటూ చెప్పటమంటే చంద్రబాబును అవమానించటమే.