తెలంగాణలో 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీలకు స్సెషల్ ఆఫీసర్ల నియామకం రాజ్యాంగ విరుద్దం అని హైకోర్టు వ్యాఖ్యానించింది. గురువారం నుంచి సరిగ్గా మూడు నెలల పాటే స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉండాలని ఈ లోపు పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కొత్త బిసి జనాభా గణనను పరిగణలోకి తీసుకోని పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టులో కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు 3 నెలల్లో ఎన్నికలు పెట్టాలని తీర్పునిచ్చింది. బీసిల జనాభా గణన కోసం మరింత సమయం కావాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఏదేమైనా సరే ప్రాసెస్ అంతా 3 నెలల్లోనే చేసి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా తీసుకోని హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో సాధారణ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఇది అంతా సాధ్యమయ్యే పని కాదని హైకోర్టుకు ప్రభుత్వం వివరించే అవవాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.
తెలంగాణలో జూలై 31న సర్పంచ్ ల పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత ఎన్నికలు పెట్టకుండా స్పెషల్ ఆఫీసర్లను నియమించి పరిపాలిస్తున్నారు. స్థానిక సంస్థల్లో అభివృద్ది కొరవడిందని అంతా ఆగమాగంగా ఉందని వెంటనే ఎన్నికలు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో పలువురు కోర్టును ఆశ్రయించారు.
స్థానిక సంస్థలు గ్రామ స్వరాజ్యానికి పట్టుకొమ్మలని గాంధీ అన్నారు. వాటికి పూర్తి స్వతంత్ర నివ్వాలన్నారు. వాటి పదవీ కాలం పూర్తి కాగానే ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగంలో కూడా పేర్కొన్నారు. కానీ వాటి ఎన్నికల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించడంతో ప్రభుత్వాలు వారికి నచ్చినట్టు వారి రాజకీయాలకనుగుణంగా ఎన్నికలు పెడుతుండటంతో స్థానిక సంస్థలు నీరుగారిపోతున్నాయి.