తెలుగుదేశంపార్టీకి హైకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. పోయిన ఎన్నికల్లో టిడిపి తరపున గెలిచిన ఎంఎల్ఏ ఈరన్న ఎన్నిక జరగదని కోర్టు తీర్పిచ్చింది.అదే సమయంలో వైసిపి తరపున ఓడిపోయిన తిప్పేస్వామే ఎంఎల్ఏగా కొనసాగవచ్చని కూడా తీర్పివ్వటం సంచలనంగా మారింది. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో పోయిన ఎన్నికల్లో టిడిపి తరపున ఈరన్న వైసిపి తరపున తిప్పేస్వామి పోటీ చేశారు. అయితే అప్పటి ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్లో వాస్తవాలు దాచిపెట్టినట్లు కోర్టు విచారణలో తేలింది.
టిడిపి ఎంఎల్ఏ ఈరన్న అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, అదే సమయంలో ఈరన్నపై ఉన్న కేసులు, భార్య ప్రభుత్వ ఉద్యోగన్న విషయాన్ని దాచిపెట్టాడని కేసు వేశారు. విచారణలో ఫిర్యాదు వాస్తవమేనని తేలింది. దాంతో కోర్టు తీర్పిస్తు ఈరన్న ఎన్నిక చెల్లదని, ఎంఎల్ఏగా తిప్పేస్వామి కొనసాగవచ్చని చెప్పింది. ఎన్నిలక సమయంలో ఇచ్చిన అఫిడవిట్లో ఈరన్న వాస్తవాలు వెల్లడించలేకపోవటాన్ని కోర్టు తప్పుపట్టింది.
ఈరన్నపై నాలుగు క్రిమినల్ కేసులున్నాయి. కేసుల వివరాలను దాచిపెట్టటం ద్వారా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లైంది. కర్నాటకలో దాఖలైన ఓ కేసులో శిక్ష కూడా పడింది. ఏపిలో రెండు కేసులు నమోదవ్వగా అందులో ఒక కేసులో చార్జిషీట్ కూడా దాఖలైంది. అలాగే, ఈరన్న భార్య కర్నాటక అంగన్ వాడి విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆ విషయాలను అప్పట్లోనే తిప్పేస్వామి రిటర్నింగ్ అధికారికి చెప్పినా పట్టించుకోలేదు. దాంతో తిప్పేస్వామి కోర్టును ఆశ్రయించారు. చివరకు ఎంఎల్ఏ పదవి మరో ఆరు మాసాల్లో ముగుస్తోందనగా ఇపుడు తీర్పు రావటం గమనార్హం.