సుజనాకు హై కోర్టు షాక్

కేంద్ర మాజీమంత్రి, టిడిపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి హై కోర్టు షాకిచ్చింది. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో విచారణకు హాజరువాలంటూ సిబిఐ నోటీసుపై సుజనా కోర్టుకెక్కిన విషయం తెలిసిందే.  తనపై సిబిఐ విచారణ జరపటంపై స్టే ఇవ్వాలంటూ సుజనా కోర్టులో కేసు వేశారు. అయితే మంగళవాం కేసును పరిశీలించిన కోర్టు స్టే ఇవ్వటానికి నిరాకరించారు.

సిబిఐ నోటీసులపై స్టే ఇవ్వటం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది. అదే సమయంలో సుజనాను అరెస్టు చేయవద్దంటూ సిబిఐని కూడా కోర్టు ఆదేశించింది. సిబిఐ చెప్పినట్లు మే 4వ తేదీన కాకుండా 27, 28 తేదీల్లో విచారణకు హాజరుకమ్మని సుజనాను ఆదేశించించటం గమనార్హం.

కోర్టు ఆదేశాలు ఎలాగుందంటే కర్ర విరక్కుండా పాము చావకుండా అన్నట్లుగా అనిపిస్తోంది. విచారణ నుండి తప్పించుకోవాలని చూస్తున్న సుజనాకు షాకిస్తూనే సిబిఐకి కూడా ముందస్తు కండీషన్లు పెట్టింది అరెస్టు విషయంలో.  వివిధ బ్యాంకుల నుండి దాదాపు రూ 8 వేల కోట్లు అప్పుగా తీసుకుని ఎగొట్టిన ఆరోపణలను సుజనా ఎదుర్కొంటున్నారు.

చెన్నైలోని ఆంధ్రాబ్యాంకు నుండి తీసుకున్న రూ. 71 కోట్లను డొల్ల కంపెనీలకు తరలించినట్లు ఆధారాలున్నాయని సిబిఐ వాదిస్తోంది. సరే ఎవరి వాదన ఎలాగున్నా మొత్తానికి బ్యాంకుల నుండి కోట్లాది రూపాయలు రుణాలు తీసుకున్నది వాస్తవమని, ఎగొట్టిందీ వాస్తవమేనని రాజకీయంగా ప్రచారం బాగా జరుగుతోంది. మరి ఈ వ్యవహారానికి ఎప్పుడు ఫులిస్టాప్ పడుతుందో చూడాల్సిందే.