అయ్యన్నపై మండిపడిన హైకోర్టు… తాజా విచారణపై సంచలన వ్యాఖ్యలు!

వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏకవచనంతో సంబోదిస్తూ… ఎన్నోసార్లు అత్యంత అవమానకరంగా టీడీపీ నేతలు మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయనపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు. ఇందులో భాగంగా ఎన్నోసారు పూర్తి అభ్యంతరకర భాషను కూడా ఉపయోగిస్తున్నారు.

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా… టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో వ్యక్తిగతంగా విమర్శలు చేస్తుంటారు. ఇక మిగిలిన నేతలు ఆగుతారా? చంద్రబాబు దగ్గర మార్కులు పోతాయేమోనని వీళ్లు కూడా శృతిమించీ స్థాయిమరిచి జగన్ పై విమర్శలు చేస్తుంటారు. ఇలా చేసేవారిలో విజ్ఞత మరిచి మరీ విమర్శించే వారిలో అయ్యన్నపాత్రుడు ఒకరు!

మాజీమంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏపీ ముఖ్యమంత్రిపై విమర్శలు చేసే విషయంలో సోయమరిచి మాట్లాడుతుంటారని అంటుంటారు. ఆయన వేదికలపై మాట్లాడినా, మీడియా సమావేశం నిర్వహించినా జగన్‌ ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ.. బూతులు తిట్టేస్తుంటారు. దీంతో తాజాగా లోకేష్ యువగళంలో కూడా అలాగే తిడితే పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేసి వదిలిపెట్టారు.

దీంతో ఇకపై తనను పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని చింతకాయల అయ్యన్న కోర్టులో పిటీషన్ వేశారు. దీంతో తాజాగా ఈ కేసును విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్హంగా అయ్యన్నపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై అసభ్య పదజాలం ఉపయోగించటం ఏమిటంటే మండిపోయింది.

ఇదే క్రమంలో అయ్యన్నపాత్రుడి పదజాలం ముమ్మాటికి తీవ్ర అభ్యంతరకరమే అంటూ కోర్టు ఆక్షేపించింది. ఇలాంటి మాటలను ఎంతమాత్రం అనుమతించేదిలేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అయ్యన్న వాడుతున్న బూతులు ఎంతవరకు ఆమోదయోగ్యమో మీరు చెప్పండి అంటూ హైకోర్టు ఆయ‌న‌ లాయర్‌ నే ప్రశ్నించింది. దీనికి సదరు లాయర్ ఏమీ సమాధానం చెప్పలేక నిలుచుండిపోవడం గమనార్హం!

అనంతరం అయ్యన్నకు 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించడంలో తప్పేమీలేదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో… కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు తొందరలోనే చింతకాయలను అదుపులోకి తీసుకుని విచారించేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తుంది. కోర్టే స్వయంగా నోటీసులిచ్చి విచారించమని చెప్పింది కాబట్టి.. ఇక అయ్యన్నకు ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు.

ముఖ్యమంత్రిని పట్టుకుని బూతులు తిట్టడం, మహిళా మంత్రులపైనా అసభ్యంగా మాట్లాడటం వంటి పనులు చేసిన అయ్యన్నను మరి పోలీసులు ఎప్పుడు తీసుకెళ్తారనేది వేచి చూడాలి. అయితే అయ్యన్నకు సరైన ట్రీట్ మెంట్ జరగాలని.. ఫలితంగా మిగిలినవారికి అది ఉదాహరణగా ఉంటుందని పలువురు కామెంట్లు పెడుతుండటం కొసమెరుపు!