ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు ముందస్తు బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్ లో ఏపీబీ, సీఐడీ కౌంటర్ దాఖలు చేయకపోవటంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ వేయడానికి ఇంత జాప్యమెందుకు చేశారని ప్రశ్నించింది.ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలో నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏబీ వెంటేశ్వరరావు అవినీతికి పాల్పడ్డారంటూ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆయనపై చర్యలకు సిద్ధమైంది. దీంతో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఏబీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా గతంలోనే హైకోర్టు ఏసీబీ, సీఐడీని ఆదేశించింది.కానీ ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ సమయానికి కౌంటర్ దాఖలు చేయకుంటే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ఆదేశాలిచ్చారు.
నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో తనను ఏదో విధంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, రక్షణ కల్పిస్తూ ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఏబీ అరెస్ట్ విషయంలో తొందరపాటుగా వ్యవహరించవద్దని.. పోలీసులను గతంలోనే ఆదేశించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పినా ఫైల్ చేయకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలుకు మరింత సమయం కావాలని పోలీసుల తరపు న్యాయవాది ధర్మసనానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.