జగన్ కేసు : ఇరుక్కుపోయిన చంద్రబాబు

జగన్ పై హత్యాయత్నం కేసులో చంద్రబాబునాయుడు అడ్డంగా ఇరుక్కుపోయారా ? రాజకీయ పార్టీల్లో ఇపుడిదే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే, జగన్ పై హత్యాయత్నం కేసులో హైకోర్టు నేరుగా చంద్రబాబుకే నోటీసులు జారీ చేయటం తెలుగుదేశంపార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అది హత్యాయత్నం కాదని కేవలం డ్రామాగా ఇంతకాలం చంద్రబాబు అండ్ కో కొట్టేస్తున్న నేపధ్యంలో అదే కేసులో సమాధానం చెప్పాలంటూ కోర్టు ఆదేశించటం చంద్రబాబు అండ్ కోకు ఏమాత్రం మింగుడుపడటంలేదు. పోయిన నెల 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం జరిగిన గంటలోపో డిజిపి చేసిన వ్యాఖ్యలు తర్వాత చంద్రబాబు చేసిన కామెంట్లే ఇపుడు వారి మెడకు చుట్టుకుంది.

ఘటనను ఘటనగా చూడకుండా చంద్రబాబు వ్యక్తిగతంగా తీసుకున్నారు. అందుకనే సానుభూతి కోసం తనపై తానే దాడి  చేయించుకున్నాడంటూ జగన్ ను అవహేళనగా మాట్లాడారు. గంటసేపు మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఘటనతో పాటు జగన్ పై  చాలా ఓవర్ యాక్షనే చేశారు. తర్వాతెప్పుడో ఘటనను విచారించేందుకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

చంద్రబాబు, డిజిపిలు ఘటనపై ముందే తమ అభిప్రాయాలు చెప్పేసి తర్వాత విచారణ చేయిస్తున్నట్లు చెప్పటంతో విచారణలో తమకు న్యాయం జరగదని, కుట్ర కోణం బయటకు రాదన్న  ఉద్దేశ్యంతో జగన్ సిట్ విచారణను తిరస్కరించారు. అంతేకాకుండా అదే విషయాన్ని వివరిస్తు థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ కోరుతూ హైకోర్టులో కేసు వేశారు. ఇపుడా కేసుపైనే కోర్టు నోటీసులివ్వటంతో చంద్రబాబు మెదకు చుట్టుకున్నది.

విచారణలో భాగంగా చంద్రబాబు మీడియాతో చేసిన వ్యాఖ్యలను మొత్తం జగన్ తరపున లాయర్ కోర్టు ముందుంచారు. తన వ్యాఖ్యలపై అన్ని వైపుల నుండి ఎదురైన నిరసన తర్వాత హత్యాయత్నం డ్రామాగా తాను చెప్పలేదని చంద్రబాబు మాట మార్చారు. ఆ విషయాలకు సంబంధించిన వీడియో క్లిప్పుంగులను కూడా కోర్టుకు అందించారు. అన్నింటినీ పరిశీలించిన తర్వాతే చంద్రబాబుకు నోటీసులివ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.

మీడియా సమావేశంలో చెప్పిన విషయాలనే చంద్రబాబు కోర్టుకు ఇచ్చే సమాధానంలో చెబుతారా ? లేకపోతే ఇంకేదన్న విషయాలను ప్రస్తావిస్తారా ? అన్నదే తేలాలి. ఘటనపై విచారణకు ఆదేశించకుండానే దాన్ని డ్రామాగా ఎలా తేల్చేశారో చంద్రబాబు సమాధానమివ్వాలి. మీడియా సమావేశాల్లో ఎదరుదాడి చేసి విలేకరుల నోళ్ళు మూయించినట్లు కాదు కోర్టుకు సమాధానం ఇవ్వటమంటే.

 

అన్నీ వ్యవస్ధలకు తాను అతీతుడనని అనుకునే చంద్రబాబుకు కోర్టు నోటీసులు జారీ చేయాలని ఆదేశించటాన్ని తమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్న ధర్మాబాద్ కోర్టు నోటీసు విషయంలో చంద్రబాబు అండ్ కో ఎంత హడావుడి చేసిందో అందరూ చూసిందే. చంద్రబాబు మాత్రమే కాదు డిజిపి, విమానాశ్రయ అధికారులు అందరూ ఇరుక్కున్నట్లే. మరి రెండు వారాల్లో కోర్టుకు చంద్రబాబు ఏమని సమాధానమిస్తారనే దానిపై జగన్ హత్యాయత్నం కేసు పురోగతి ఆధారపడుంటుంది. చూద్దాం ఏం  జరుగుతుందో .