జనసేన పార్టీలో చేరనున్న ఆ సినీ నటి ఎవరబ్బా.?

జనసేన పార్టీలోకి సినీ పరిశ్రమ నుంచి చేరికలు షురూ కాబోతున్నాయట. సినీ నటుడు అలీ, జనసేనలో చేరతారంటూ ప్రచారం జరుగుతోన్న విషయం విదితమే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడైన అలీ, కొన్ని ప్రత్యేక కారణాలతో 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరారు. అయితే, వైసీపీలో ఆయన ఆశించిన గుర్తింపు మాత్రం దక్కలేదు. నామినేటెడ్ పదవులు ఆశించారు, అవీ దక్కకపోవడంతో అలీ కొంత అసహనంతో వున్నారు.

అలా పుట్టిన అసహనం నేపథ్యంలోనే ఆయన జనసేనలోకి దూకేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, పవన్ కళ్యాణ్ నుంచి అలీకి గ్రీన్ సిగ్నల్ రావాల్సి వుంది. గతంలో జనసేన మీద అలీ చేసిన రాజకీయ విమర్శల నేపథ్యంలో అలీని, పార్టీలోకి తీసుకోవద్దన్న చర్చ జనసేన వర్గాల్లో జరుగుతోంది.

ఇదిలా వుంటే, ఓ సినీ నటి జనసేన పార్టీలో చేరబోతోందిట. ఆమె ఎవరో కాదు పూనమ్ కౌర్ అని అంటున్నారు. పూనమ్ కౌర్ పేరు తరచూ వార్తల్లోకెక్కుతుంటుంది. ఆమె పేరుతో పవన్ కళ్యాణ్ పేరుని ముడిపెట్టి, ఎప్పటికప్పుడు గాలివార్తల్ని ప్రచారంలోకి తెస్తుంటారు కొందరు. అయితే, వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వుంటుందామె. తెలంగాణ జనసేనలో ఆమె కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయట.

మరో సినీ నటి మాధవీ లత గతంలో బీజేపీలో పని చేశారు. అయితే, ఆమె త్వరలో జనసేనలో చేరతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌కి తాను వీరాభిమానినని చెబుతుంటారు మాధవీ లత. సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు మాధవీ లత.

కాగా, ఓ సినీ రచయిత కూడా జనసేన పార్టీలో చేరేందుకు సుముఖంగా వున్నారనీ, బంధువులు వైసీపీలో వున్నా, వైసీపీతో సన్నిహిత సంబంధాలున్నా, వచ్చే ఎన్నికల్లో జనసేన వెంట నడవాలని సదరు సినీ రచయిత నిర్ణయించుకున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈయనా గతంలో పవన్ కళ్యాణ్‌ని రాజకీయంగా తూలనాడిన నేపథ్యంలో జనసైనికులు ఆయన రాకని తీవ్రంగా వ్యతిరేకించే అవకాశాల్లేకపోలేదు.