జనసేనాని పవన్ కళ్యాణ్‌కి రోడ్ మ్యాప్ ఇవ్వనున్న ప్రధాని మోడీ.?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఢిల్లీకి ఆహ్వానించబోతున్నారా.? అక్కడే జనసేన అధినేతకు, ప్రధాని మోడీ ఓ రోడ్ మ్యాప్ ఇవ్వబోతున్నారా.? బీజేపీ వర్గాల్లో ఇప్పుడు ఇదే విషయమై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. చిత్రంగా వైసీపీ వర్గాల్లోనూ ఈ అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇంకా విచిత్రమేంటంటే, తెలుగుదేశం పార్టీలో ఈ రోడ్ మ్యాప్ విషయమై ఆందోళన నెలకొంది.

జనసేన పార్టీ మాత్రం, ఈ మొత్తం వ్యవహారంపై వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ఇటీవల విశాఖలో ప్రధాని మోడీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య భేటీ జరిగిన విషయం విదితమే. విశాఖకు పవన్ కళ్యాణ్‌ని ప్రధాని రప్పించుకుని మరీ ఈ భేటీ నిర్వహించారు. ప్రధానితో భేటీ తర్వాత, ‘రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయ్..’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ప్రధానితో జనసేనాని భేటీకి సంబంధించిన కీలకమైన విషయాల్ని బయటపెట్టలేం.. ఎవరికీ ఈ విషయమై సమాధానం చెప్పాల్సిన పనిలేదు.. అని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీకి తాను చెప్పాలనుకున్నది చెప్పారు. ఆయా అంశాలపై ఓ నివేదిక కూడా ప్రధానికి జనసేనాని అందించారట.

నివేదికపై చర్చించి, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటానని పవన్ కళ్యాణ్‌కి చెప్పిన ప్రధాని మోడీ, ఇప్పుడు ఆ విషయాలపైనే లోతైన పరిశీలన చేస్తున్నారన్నది తాజా ఖబర్. మరీ, అంత సీన్ పవన్ కళ్యాణ్‌కి మోడీ ఇస్తారా.? అంటే, అదీ ఆలోచించాల్సిన విషయమే. అయితే, బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీట్లు అవసరమవుతాయ్.! అవి సొంత సీట్లు అయితేనే, బీజేపీకి మేలు. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశాన్నీ బీజేపీ వదులుకోవడంలేదు. బీజేపీ లోక్ సభ సీట్లను ఎక్కువగా కోరుకుంటుందనీ, అసెంబ్లీ సీట్ల విషయమై జనసేనతో పెద్దగా బీజేపీకి పంచాయితీ వుండబోదని అంటున్నారు. పూర్తి రోడ్ మ్యాప్ ఇచ్చేందుకోసం ఢిల్లీకి జనసేనాని త్వరలో మోడీ ఆహ్వానించబోతున్నారట.