ఆలూరు – గుంతకళ్లు మధ్యలో గుమ్మనూరు హాస్యం!

చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటారు! ఎన్నికల వేళ పార్టీలు మారే పలువురు నేతలు చెప్పే విషయానికి ఈ వాక్యం సరిగ్గా సరిపోతుంది!! తమ తమ వ్యక్తిగత సమస్యలతోనో, వ్యక్తిగత అవసరాలమేరకో చాలామంది నేతలు పార్టీలు మారుతుంటారు. ఈ సందర్భంగా వారు ఇచ్చే స్టేట్ మెంట్లు, చేసే వ్యాఖ్యలు గొప్ప హాస్యాన్ని పండిస్తాయని అంటుంటారు. తాజాగా గుమ్మనూరు అదే కోవలో వ్యాఖ్యానించారనే అనుకోవాలి!

గుమ్మనూరు జయరాం.. టీడీపీ పెట్టిన ముద్దుపేరు “బెంజ్ మంత్రి” తాజాగా టీడీపీలో చేరారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని మరోసారి చాటిచెప్పారు. తనను పేకాట ఆడించేవాడని, భూకబ్జాలు చేసేవాడని, పక్కరాష్ట్రాల నుంచి మధ్యం తెచ్చి అమ్మేవాడని అతికొద్ది రోజుల క్రితం విమర్శలు చేసినవారితో చేతులు కలిపారు. దీంతో… తిట్టినవారు తిట్టించుకున్నవారు చేయి చేయి కలిపి జనాల్లోకి రాబోతున్నారు!

ఈ సందర్భంగా స్పందించిన గుమ్మనూరు… తనను జగన్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీగా పోటీ చేయమన్నారని.. అది తనకు ఏమాత్రం నచ్చలేదని, పైగా తాను అలా పోటీ చేస్తే ఆలూరు ప్రజల మనోభావాలు దెబ్బ తింటాయని చెప్పుకొచ్చారు. సపోజ్ అదే నిజమైతే… మరి అనంతపురం జిల్లాలోని గుంతకళ్లుకు ఎలా వెళ్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

వైసీపీకి రాజినామా చేసి చంద్రబాబు, పవన్ ల సమక్షంలో గుమ్మనూరు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో వైసీపీని వీడటానికి ఆయన చెప్పిన ప్రధాన కారణం… తనను కర్నూలు ఎంపీగా పోటీ చేయమన్నారు.. అలా చేస్తే ఆలూరు ప్రజలు హర్ట్ అవుతారు.. వారంతా తాను ఆ నియోజకవర్గంలోనే పోటీ చేయాలని కోరుతున్నారు అని. ఇదే నిజమైతే… టీడీపీ టిక్కెట్ పై ఆయన ఇప్పుడు ఆలూరు నుంచే పోటీ చేయాలి.

కానీ… చంద్రబాబు ఆ అవకాశం ఇవ్వలేదు. గుంతకళ్లు నుంచి పోటీ చేయాలని సూచించారని తెలుస్తుంది. దానికి కూడా గుమ్మనూరు వద్ద తనమార్కు సమాధానం రెడీగా ఉంది. అదేమిటయ్యా అంటే… తన స్వస్థలం గుంతకల్లుకు సమీపంగా ఉండటమేనట. దీంతో… నిజంగా అల్లూరు ప్రజలు గుమ్మనూరును కోరుకుంటే… చంద్రబాబును ఆ దిశగా ఆయన ఒప్పించుకోవాలి కదా!

అలా కాకుండా ఏదో ఒక కారణం చెప్పి పక్క జిల్లాకు వెళ్లడం చూస్తుంటే… ఆయన అవకాశవాద రాజకీయాలకు ఇంతకు మించిన ఉదాహరణ ఉంటుందా..? అనే ప్రశ్న తెరపైకి వస్తుంది. ఆలూరు ప్రజలు హర్ట్ అయినా సరే.. రాబోయే ఎన్నికల్లో గుంతకల్లు ప్రజలు ఏమి సమాధానం చెబుతారో వేచి చూడాలి మరి!