గూడూరు గ్రామసభలో టిఆర్ఎస్ ఎర్రబెల్లికి ఝలక్ (వీడియో)

పాలకుర్తి టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జులై 30వ తేదీన తన నియోజకవ్గంలోని గూడూరులో జరిగిన గ్రామ సభలో ఎర్రబెల్లి మాట్లాడారు. సమావేశం నాటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. గూడురులో తనకు మెజార్టీ ఇవ్వలేదని బాధపడ్డారు ఎర్రబెల్లి.

కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ ఇచ్చారని, అయినా గూడూరును వదిలిపెట్టకుండా అభివృద్ధి చేస్తున్నానని అన్నారు.  గూడూరు కాలువ పనులు టిడిపి హయాంలోనే మొదలయ్యాయని అన్నారు. కాంగ్రెస్ పదేళ్లు ఏమాత్రం పట్టించుకోకుండా కాలువ పనులు పండబెట్టిందని మండిపడ్డారు. ఏడాది తర్వాత అఫిషియల్ కాలువ పూర్తవుతుందన్నారు.  

ఎర్రబెల్లి మాట్లాడే సమయంలో గూడూరు గ్రామానికి చెందిన ఆదినారాయణ అనే యువకుడు ఎర్రబెల్లిని ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. దీంతో ఎర్రబెల్లి ఆ యువకుడిని ఉద్దేశించి కసిగా మాట్లాడారు. ఎర్రబెల్లితో వాగ్వాదానికి దిగాడు ఆ యువకుడు. కింద వీడియోలో ఎర్రబెల్లి తో యువకుడి వాగ్వాదం సీన్ ఉంది.