విశ్లేషణ: గుడివాడలో కొడాలి నాని బలమిదే!

ఈసారి ఏపీలో రాబోయే ఎన్నికల్లో హీటెక్కించే నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. ఇక్కడ నుంచి నాలుగు సార్లు వరుసగా గెలుస్తూ… “గుడివాడ అంటే కొడాలి నాని.. కొడాలి నానీ అంటే గుడివాడ” అన్నంతగా మార్చేసుకున్నారు. ఇదే ఫ్లో కంటిన్యూ చేస్తూ 2024లో కూడా పోటీచేస్తానని, గెలుస్తానని కూడా నానీ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. అయితే… నానీ ఈ స్థాయిలో మాట్లాడటానికి గల ధైర్యం ఏమిటి? నానికి గుడివాడలో ఆయంకున్న నమ్మకం ఏమిటి? అంతలా నానీతో కలిసిపోయిన అంశం ఏమిటి… బలపరుస్తున్న జనాలెవ్వరు, తోడొస్తున్న సామాజికవర్గాలేమిటి అన్నది ఇప్పుడు చూద్దాం!

చంద్రబాబు ని పోటీకి రమ్మనే ధైర్యం:

గుడివాడలో రాబోయే ఎన్నికల్లో తనపై టీడీపీ అధినేత చంద్రబాబు కానీ.. ఆయన కుమారుడు లోకేష్ కానీ పోటీచేయొచ్చని పబ్లిక్ గా సవాల్ విసురుతున్నారు కొడాలి నాని. ఈ విషయంలో చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ… తనపై ధమ్ముంటే జగన్ పోటీచేయాలని పొరపాటున కూడా ఛాలెంజ్ చేయడం లేదు. కానీ… ఒక పార్టీ అధినేత, 40ఏళ్ల రాజకీయ అనుభవం, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని.. “తనపై పోటీకి రమ్మని.. తనకు ధైర్యం లేకపోతే తన కుమారుడిని అయినా తనపై పోటీకి దింపాలని” కొడాలి కోరుతుతున్నారు. ఇదొక్కటి చాలు కొడాలికి గుడివాడలో ఉన్న నమ్మకం ఎంత గట్టిదో చెప్పడానికి.

సామాజికవర్గాల వారీగా ఓటర్ల లెక్క:

గుడివాడ నియోజకవర్గంలో… సుమారు 2లక్షల 8వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో లక్షా పది వేల మంది బీసీలే ఉన్నారు. ఇక కాపు సామాజికవర్గ ఓటర్లు ముప్పయి అయిదు వేల దాకా ఉండగ… ఎస్సీలు నలభై అయిదు వేల వరకూ ఉన్నారు. ఖమ్మ సామాజికవర్గం ఓటర్లు పదిహేను వేల వరకూ ఉంటారు. అయితే… ఈ విషయంలో కొడాలికి ఇప్పటివరకూ ఆ సామాజికవర్గం.. ఈ సామాజికవర్గం అని తేడా లేకుండా… ఒక్కో సందర్భంలో ఒక్కో సామాజికవర్గం ప్రధానంగా మద్దతు పలకగా.. మిగిలిన అన్ని సామాజికవర్గాలు తలో చెయ్యీ వేస్తూ వచ్చాయని తెలుస్తుంది!

2004 లో ఇలా జరిగింది:

2004లో మొదటిసారి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీచేసిన కొడాలి నానీ… 52.59% ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచారు. మెజారిటీ 8,800. ఇది భారీ మెజారిటీ ఏమీ కాదు! కారణం… అది వైఎస్సార్ హయాంలో జరిగిన ఎన్నికలు కూడా! అయితే… 50% పై చిలుకు ఓట్లు కొడాలి ఖాతాలో ఉన్నాయి. అప్పట్లో కమ్మ సామాజికవర్గంతోపాటు బీసీలు టీడీపీకి మద్దతుగా ఉండటంతో ఇది సాధ్యమైందని అంటారు. అప్పట్లో ఎస్సీలు, కాపులు… మాగ్జిమం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండేవారు!!

2009 ఎన్నికల్లో ఇలా…:

ఇక 2009 లో రెండోసారి కూడా టీడీపీ నుంచి పోటీచేసిన కొడాలికి 46% ఓట్లు వచ్చాయి. కానీ… మెజారిటీ 17,630. కారణం… ఇక్కడ పీఆర్పీ కూడా పోటీకొచ్చింది. దాంతో మెజారిటీ కాపు ఓటర్లు కొడాలికి అనుకూలంగా వేయలేకపోయినా… బీసీలు పూర్తిగా మద్దతు పలికారు! ఈ ఎన్నికల్లో కొడాలికి 68,034 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 50,404 ఓట్లు వచ్చాయి. ఇక పీఆర్పీ అభ్యర్థికి 28,328 ఓట్లు వచ్చాయి. అంటే… ఇక్కడ 50శాతంలోపే వచ్చినా కూడా మెజారిటీ అధికంగా వచ్చింది.

వైసీపీ నుంచి తొలిసారి:

ఇదే క్రమంలో వైఎస్సార్ సీపీ ఎంటరయ్యాక 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీచేసిన కొడాలి నాని… 55.32%శాతం ఓట్లతో గెలుపొందారు. ఈసారి పోటీ వైసీపీ – టీడీపీ మధ్యే జరిగింది. ఈ ఎన్నికల్లో 11,537 ఓట్ల మెజారిటీతో కొడాలి గెలిచారు. అంటే… ఇక్కడ మెజారిటీ గతంతో పోలిస్తే తక్కువే అయినా.. తనకు పోలైన ఓట్లు 55శాతం.

గడిచిన ఎన్నికల్లో ఇలా:

ఇదే విధంగా 2019లోనూ పోటీచేసిన కొడాలి నాని… 53.50% ఓట్లు సంపాదించారు. మెజారిటీ 19,479 ఓట్లు. విచిత్రంగా ఇక్కడ ఓట్ల శాతం ఎక్కువే.. మెజారిటీ కూడా గొప్పదే! అప్పడు కూడా రెండు పార్టీలే పోటీలో ఉన్నాయి. అప్పుడు టీడీపీ నుంచి పోటీచేసిన దేవినేని అవినాష్ ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున / టీడీపీ – జనసేనల తరుపున ఎవరు పోటీచేస్తారన్నది క్లారిటీ లేదు!

2024 ఎలా ఉండొచ్చు.. ఎవరు తోడుండొచ్చు:

అయితే… 2019 ఎన్నికలనుంచి బీసీలు వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి. తనపాలనలో బీసీలకు జగన్ ఇచ్చిన ఆర్థికపరమైన, సంక్షేమపరమైన మద్దతుతో ఈసారి వారిమద్దతు వైసీపీకే అన్నది క్లారిటీగానే ఉన్న విషయం. ఇదే క్రమంలో… ఎస్సీలు ఎలాగూ జగన్ వైపే ఉంటారన్నది నిర్వివాదాంశం. ఈ రెండు సామాజివర్గాలూ గుడివాడ లో పూర్తిగా కొడాలికి మద్దతు పలికితే… గెలుపు నల్లేరు మీద నడకే!

ఇక కమ్మ సామాజివర్గ నేతలు కొడాలి నానిని కాదని పూర్తిగా టీడీపీ పక్షాన్న నిలుస్తారని కూడా చెప్పలేని పరిస్థితి. ఇక టీడీపీతో జతకడితే… కాపులు గంపగుత్తగా జనసేనకు వేస్తారని గట్టిగా పవన్ కూడా చెప్పలేని పరిస్థితి. టీడీపీతో కలవకపోతే అవసరమైతే.. ఉన్న 35,000 ఓట్లు ఆ సామాజికవర్గం వారు జనసేనకు గంపగుత్తగా అయినా వేసేస్తాం తప్ప… టీడీపీతో జతకట్టొద్దని చెబుతున్న పరిస్థితి! ఈ తరుణంలో… టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే… పూర్తిగా ఏ సామాజికవర్గం వారికి అండగా ఉంటుందనేది క్లారిటీ లేదు! అంటే… ఈసారి మూడు పార్టీలూ పోటీచేసినా… పొత్తు ఫలితంగా రెండు పార్టీల మధ్యే పోటీ ఉన్నా… కొడాలికి వచ్చిన ఇబ్బందేమీ లేదన్నమాట.

ఇదే కొడాలి ధైర్యం…!:

తనను బాగా అభిమానించే బీసీలు, వైసీపీకి రెడ్లకంటే ఎక్కువగా మద్దతుగా నిలిచే ఎస్సీలు, క్రీస్టియన్లు, ముస్లింలు.. టీడీపీతో పవన్ జతకడితే వారితో విభేదించే కాపు ఓటర్లకు తోడు.. తనను వ్యక్తిగా అభిమానించే కమ్మ ఓటర్ల తో కలిపి… కొడాలి నానీకి ఈ సారి కూడా ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకే అనే వాదనలు అటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ, ఇటు సాధారణ ప్రజానికంలోనూ బలంగా వినిపిస్తున్నాయి.. భూతకాలం, వర్తమానం అదే చెబుతున్నాయని.. భవిష్యత్తు అంతకు భిన్నంగా ఉండదని అంటున్నారు విశ్లేషకులు!

అంటే… ఎన్నికలలోపు ఏపీ రాజకీయాల్లో బ్రహ్మాండం భద్దలైపోయే సంఘటన జరిగి, అది ప్రభుత్వానికి వ్యతిరేకమైనదై, అద్భుతం జరిగితే తప్ప… కొడాలి గెలుపు కన్ ఫాం అన్నమాట!