వైసీపీకి ‘గుడివాడ’ అస్సలు కలిసి రాలేదంతే.!

గుడివాడ ఎమ్మెల్యే కావొచ్చు.. గుడివాడ అమర్నాథ్ కావొచ్చు.. రెండిటిలోనూ ‘గుడివాడ’ కామన్. మిగతాదంతా సేమ్ టు సేమ్.! గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అనగానే, ‘బూతుల మంత్రి’ అని చర్చ జరిగేది అప్పట్లో. అప్పటికీ, ఇప్పటికీ.. అంటే, మంత్రిగా వున్నప్పటికీ.. మంత్రి పదవి కోల్పోయాక.. ఆయనలో పెద్దగా వచ్చిన మార్పు ఏమీ లేదు. మంత్రి, మాజీ మంత్రి.. అన్న తేడా తప్పితే. మిగతా బూతుల వ్యవహారమంతా సేమ్ టు సేమ్.

నిజానికి, గుడివాడ ఎమ్మెల్యే స్థాయిలో బూతులు మాట్లాడరుగానీ.. అంతకు మించి వైసీపీని డ్యామేజ్ చేసేస్తున్నారు ప్రస్తుత ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ విషయంలో.. ‘వారాహి’ వాహనం విషయంలో.. కాపు సామాజిక వర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ మీద చేసే ఆరోపణల విషయంలో, గుడివాడ అమర్నాథ్ చూపించే అత్యుత్సాహం అంతా ఇంతా కాదు.

అప్పట్లో మంత్రిగా వున్నప్పుడు కొడాలి నాని ఎలాగైతే.. తన శాఖకు సంబంధించి ఏమీ తెలియకుండానే ‘మమ’ అనిపించేశారో.. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ కూడా అంతే. నూడుల్స్ బళ్ళు ప్రారంభోత్సవం చేయడం తప్ప.. మచ్చుకి ఓ చిన్నదైన సాఫ్ట్‌వేర్ సంస్థని సైతం ఆయన ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించింది లేదు.

‘వారాహి’ ఎలా ఆంధ్రప్రదేశ్‌లో తిరుగుతుందో చూస్తానంటూ ఆ మధ్య ప్రకటించిన గుడివాడ అమర్నాథ్, వారాహి ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద ఎలాంటి అభ్యంతరాలూ లేకుండా తిరిగాక.. ‘నేనేమీ అడ్డుకుంటానని అనలేదు.. ఎలా తిరుగుతుందో చూస్తానని మాత్రమే అన్నాను..’ అంటున్నారిప్పుడు. అసలు ఈ ‘గుడివాడ’ పోటు ఏంటి వైసీపీకి.? ఇదే వైసీపీలో జరుగుతున్న చర్చ. పార్టీకి ఈ ‘గుడివాడ’ వల్ల నష్టమే తప్ప లాభమే లేదని అటు గుడివాడ నియోజకవర్గంలోనూ, ఇటు మంత్రిగారి విషయంలోనూ పెద్ద చర్చే జరుగుతోంది.