ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా… అభ్యర్థుల ఎంపికలో టీడీపీ అధినేత చంద్రబాబు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా గెలవాలని చంద్రబాబు కలలుగంటున్నారంటూ కథనాలొస్తున్న గుడివాడ నియోజకవర్గంపై సర్వే ఫలితాలు తెరపైకి వచ్చాయి.
గుడివాడ నియోజకవర్గం రాజకీయంగా అత్యంత కీలకంగా మారుతోన్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో 2004 నుంచి మాజీ మంత్రి కొడాలి నాని వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన నాని… 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందారు.
ఇలా వరుసగా గుడివాడ నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని… జగన్ ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. అయితే విపక్ష సభ్యులపై… ముఖ్యంగా చంద్రబాబు – లోకేష్ లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటారు కొడాలి నాని. ఒక్కమాటలో చేప్పాలంటే… తనదైన విమర్శలతో వీరిద్దరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు.
దీంతో రాబోయే ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నానీని ఎలాగైనా ఓడించాలని బలంగా ఫిక్సయ్యారు చంద్రబాబు & కో. ఇందులో భాగంగా ఇంతకాలం పార్టీకి సేవలందించిన రావి వెంకటేశ్వర్ రావుని కాదని మరీ ఎన్నారైని రప్పించారు చంద్రబాబు. ఇందులో భాగంగా వెనిగళ్ల రాముకు సీటు ఖాయమని చెబుతున్నారు.
ఇలా గుడివాడలో కొడాలి నానీని ఓడించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు. ఈసారి తాను ప్రతిపక్షంలో… కొడాలి నాని అధికారపక్షంలో కూర్చి ఉంటే… భరించడం తన వల్ల కాదని, దానికంటే ఇంటికి వెళ్లి టీవీలో లైవ్ చూడటం బెటరని బాబు భావిస్తున్నారని అంటున్నారు.
బాబు కోరికలు, భయాలు, లెక్కల సంగతి అలా ఉంటే… ఇదే సమయంలో పొలిటికల్ క్రిటిక్ అనే సంస్థ గుడివాడలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయనే అంశంపై సర్వే చేసింది. అయితే ఈ సర్వే చంద్రబాబుకు మరోసారి టెన్షన్ పుట్టించింది. ఈ సర్వే ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వచ్చాయి.
తాజాగా వెలువడిన ఈ సర్వే ఫలితాల ప్రకారం… రాబోయే ఎన్నికల్లో గుడివాడలో వైసీపీకి 54.95 శాతం ఓట్లు రాగా.. టీడీపీకి 42.09 శాతం, ఎన్డీఏ కు 02.19 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉందని సర్వే సంస్థ అంచనా వేసిందని తెలుస్తుంది. ఇందులో ఎన్డీయే అంటే… జనసే, బీజేపీ కలిపే అనేది గమనార్హం! దీంతో… ఈ ఫలితాలు ఆసక్తిగా మారాయి!