లంచం తీసుకుంటుండగా ఇద్దరు జీఎస్టీ అధికారుల అరెస్టు

నిషేదిత గుట్కా, పాన్ ను తీసుకెళుతున్న వాహనాన్ని ఆపి వారి నుంచి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసి కొంత నగదును తీసకున్న జిఎస్టీ అండ్ కస్టమ్స్ చెందిన ఇద్దరు ఇన్ స్పెక్టర్లను మల్కాజ్ గిరి పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు ఇన్ స్పెక్టర్లు, కంటింజెంట్ లపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అసలు వివరాలు ఏంటంటే…

మల్లాపూర్ కు చెందిన భూపతి అజయ్ కుమార్ గుట్కా వ్యాపారి. మంగళవారం  రాత్రి ఆయన ఓ వాహనంలో గుట్కా పాన్ మసాలాల లోడ్ తో బీదర్ నుంచి వస్తున్నాడు. మౌలాలిలో జిఎస్టీ అధికారులు వాహనాన్ని ఆపారు. లారీని ఆపి తనిఖీలు చేశారు. గుట్కా పాన్ మసాలాలు ఉండడంతో ఆయన నుంచి అధికారులు 10 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో అజయ్ కుమార్ 2.50 లక్షలు ఇస్తానని మాట్లాడుకున్నాడు. అదే రాత్రి అజయ్ కుమార్ తండ్రి గంగాధర్ తెలిసిన వారి కాడ పైసలు అడుక్కొని 1.20 లక్షలు ఇచ్చాడు.

మిగతా డబ్బుల కోసం బుధవారం ఫోన్లు చేస్తుండగా బాధితుడు ఎస్ వోటి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో మిగిలిన డబ్బు తీసుకొని అజయ్ కుమార్ వెళ్లి కస్టమ్స్ అధికారులకు ఇస్తుండగా లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎస్ వోటి పోలీసులు దాడి చేసి నగదు తీసుకుంటున్న కస్టమ్స్ ఇన్ స్పెక్టర్లు అరుణ్ కుమార్, సతీష్ లను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి పై కేసు నమోదు చేశారు.