అందుబాటులో గ్రూపు 4 ఓఎంఆర్ డిజిటల్ కాపీలు

తెలంగాణ వ్యాప్తంగా అక్టోబర్ 7న నిర్వహించిన గ్రూపు 4 పరీక్ష ఓఎం ఆర్ షీట్ల డిజిటల్ కాపీలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్టు టిఎస్ పీఎస్సీ తెలిపింది. ఓఎంఆర్ షీట్ల డౌన్ లోడ్ లో ఏమైనా సమస్యలుంటే కమిషన్ ను సంప్రదించాలని తెలిపింది. వాటిని పరిశీలించి లోపాలు ఉన్న కాపీలను సవరించి వెబ్ సైట్ లో ఉంచుతామంది.

ఈ నెల నిర్వహించిన గ్రూపు 4 పరీక్షకు పేపర్ 1 కి 3,12,397 మంది హాజరవ్వగా పేపర్ 2 కి 3,09,482 మంది హాజరయ్యారు. ఇది వరకు పరీక్షలు పెడితే ఓఎం ఆర్ కార్బన్ కాపీలను అభ్యర్దులకు ఇచ్చేవారు. కానీ అలా చేస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న ఉద్దేశ్యంతో ఆన్సర్ కాపీలను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతున్నారు.

ఇప్పుడు కేవలం ఆన్సర్ షీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. సాధించిన మార్కుల వివరాలు ఉండవు. త్వరలోనే గ్రూపు 4 కీ విడుదల చేస్తామని అప్పుడు అభ్యర్ధులు మార్కులు అంచనా వేసుకోవచ్చని టిఎస్ పీఎస్సీ తెలిపింది. గ్రూపు 4 లో పరీక్ష నిర్వహిస్తున్నప్పుడు పలు అభ్యర్దులకు ఎదురైన సమస్యలు తమ దృష్టికి వచ్చిందని వాటన్నింటి పై చర్చించి ఫలితాలు ప్రకటిస్తామన్నారు.

అక్టోబర్ 7న నిర్వహించిన గ్రూపు 4 పరీక్షలో చాలా మందికి A కోడ్ సిరీస్ పేపర్ వస్తే అందులో సగం B కోడ్ ప్రశ్నలు వచ్చాయి. దీంతో గందరగోళం ఏర్పడింది. మరికొన్ని ప్రశ్నలు ప్రింట్ మిస్టెక్ పడ్డాయి. ఇలా పలు సమస్యలు ఉండటంతో వాటన్నింటికి పూర్తి పరిష్కారం లభించిన తర్వాతనే కీ విడుదల చేసే అవకాశం ఉంది.

ఎందుకంటే ఫలితాలు ప్రకటిస్తే ఎవరైనా కోర్టులలోకి వెళ్లి కేసులు వేసే అవకాశం ఉంది. తప్పిదాలు జరిగాయి. అయినా మళ్లీ వాటిని పరిష్కరించకుండా ఎలా రిజల్ట్స్ పెడుతారని పలువురు కోర్టుకెళ్తారనే అనుమానంతో టిఎస్ పీఎస్సీ పకడ్బందీగా వ్యవహరించనున్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి అవాంతరాలు లేకుండా ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.