గ్రౌండ్ రిపోర్ట్: సైనికులే స్ట్రెంత్ .. సేనానే వీక్ నెస్!

దశాబ్ధాల తరబడి ఊడింగం చేశాం.. ఎమ్మెల్యే సీటుకోసం ఏడ్చాము.. మంత్రి పదవి కోసం ఎడ్చాము.. చివర్లో ఎంఎల్సీ పదవికోసం కూడా ఏడ్చాము.. ఇక మా కడుపులు మండాయి – ఆ రోజులు పోయాయి.. ఇక చాలూ…! అంటూ చత్రపతి సినిమాలో ప్రభాస్ డైలాగ్ ని ఇలా మార్చి చెబుతున్నారు కాపు సామాజికవర్గ ప్రజలు! ఇకనైనా రాజ్యాధికారం సంపాదించాలని చూస్తున్నారు! అందుకు వారికి దొరికిన చుక్కాని జనసేన!

ఏపీలో అత్యధిక ఓట్ల శాతంతో పాటు, ఆర్థికంగానూ బలమైన కాపు సామాజిక వర్గానికి సీఎం కుర్చీ అందని ద్రాక్షగానే ఉంది! ప్రజారాజ్యం రూపంలో చిరంజీవి ఆ కోరిక తీరుస్తారని నాడు మెజారిటీ కాపులు నమ్మారు.. కానీ ఆశించిన ఫలితాలు అందలేదు. అయితే ఇప్పుడు కాలం మారింది.. జనసేన వచ్చింది.. ఇక కచ్చితంగా 2024లో సీఎం కుర్చీ కాపులకు దక్కాలని పరితపిస్తున్నారు ఆ సామాజిక వర్గ నేతలు!

అయితే.. వారి ఆశలపై తన ప్రవర్తనతో, నిర్ణయాలతో నీళ్లు చల్లుతున్నారు పవన్ కల్యాణ్. అదిగో వస్తున్నారు – ఇదిగో వస్తున్నారు అనుకున్న ప్రతీసారీ జనసేన అధినేత వెనక్కి వెళ్తూనే ఉన్నారు. ఒంటెద్దు పోకడలకు పోవడమే ఇందుకు కారణమా.. లేక, బాబుగారి పల్లకి మోయాలనే తాపత్రయమే తమకు శాపమా.. అనేది ఇప్పుడు కాపు సామాజికవర్గ నాయకులు బలంగా ఆలోచించుకుంటున్నారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని అంటున్నారు పవన్. దాని వల్ల టీడీపీకి ప్రయోజనం తప్ప.. జనసేనకు ఒరిగేదేమిటి? అనేది కాపు నేతల ప్రశ్నగా ఉంది. సైకిల్ ఎక్కితే మహా అయితే రెండు మంత్రి పదవులు వస్తాయి.. అంతకు మించి ఒనగూరేది ఏమిటి అనేది మరో ప్రశ్న!

“నిర్ణయాలు తీసుకునే అధికారం, శాసనాలు చేసే శక్తి లేని పదవులు ఎన్ని ఉంటే మాత్రం ఏమి ప్రయోజనం.. అసలు కుర్చీ మన చేతుల్లో లేనప్పుడు…” అనేది ఇప్పుడు కాపుల్లో బలంగా నాటుకుపోయిన అంశం. అయితే.. అందుకు వారు నమ్ముకున్న పవన్.. చేతకానివాడిగా, టీడీపీకి స్టెపిన్ గా ఉపయోగపడతున్నాడనే వేదన వారిని మరింత కలవరపెడుతుంది.

ఈ విషయలను కాపు నేతలు ఇప్పటికే పవన్ దృష్టికి తీసుకెళ్లాలని ఫిక్సయ్యారంట. జనసేనకు వైకాపా ఎంత దూరమో – టీడీపీ కూడా అంతే దూరం అని… ఇప్పటికీ రాజ్యాధికారం దక్కని సామాజికవర్గాలే దగ్గర అని వారు చెబుతున్న మాట. ఆ దిశగా ఆలోచనలు చేయాల్సిన పవన్… చంద్రబాబు జపం చేయడం వారికి నచ్చడం లేదట!

జనసేనను అధికారంలోకి తీసుకురావాలనే కోరిక కాపులకు ఎంత బలంగా ఉందో… అధినేతకు అందులో సంగం కూడా కనిపించడం లేదనేది వారి ఆవేదన!

మరి వారి ఆవేదనను పవన్ అర్ధం చేసుకుని అర్థవంతమైన నిర్ణయాలు తీసుకుని, ఎవరో పల్లకి మోయాలని ఆలోచించకుండా.. తనను పల్లకి ఎక్కించాలని కోరుకుంటున్నవారి ఆలోచనల్లో నడుస్తారా.. లేక, ఇలాగే ఆటలో అరటిపండులా మిగిలిపోతారా అన్నది వేచి చూడాలి!!