విశాఖ రాజధాని.. విశాఖే కాబోయే రాజధాని అంటూ ఊదరగొట్టేసిన జగన్ సర్కార్ అవే మాటలతో అయిదేళ్ల కాలాన్ని సరిపుచ్చేసింది గాని నెల రోజుల క్రితం అధికారం చేపట్టిన కూటమి సర్కార్ విశాఖాతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి మహర్దశ పట్టేలా అడుగులు కదుపుతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రెండేళ్లలోపు పూర్తి చెయ్యాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ద్వారా ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి ఎన్డీయే కూటమి సర్కార్ కట్టుబడి ఉన్నట్టు చంద్రబాబు నాయుడు ప్రకటించినట్టయింది.
నిజానికి జగన్ సర్కార్ విశాఖను రాజధాని చెయ్యాలంటే దానికి అయిదేళ్ల సాగదీత అవసరం లేదు. శాసనసభలో అంత సంఖ్యాబలం ఉన్న జగన్ అనుకున్నంతనే విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తూ తాను నిర్ణయించిన మేరకు మూడు రాజధానుల వాగ్దానాన్ని అమలులోకి తెచ్చి ఉండవచ్చు.అయితే నాటి సర్కారుకు చిత్తశుద్ధి లేక కేవలం విశాఖ రాజధాని అనే విషయాన్ని రాజకీయ కోణంలోనే చూడడం వల్ల అయిదేళ్ల పదవీకాలం పూర్తయ్యే వరకు విశాఖకు రాజధానిని తరలించలేకపోయింది.
తరలిస్తా..వచ్చేస్తా.. అంటూ రుషికొండలో ప్రభుత్వ స్ధలంలో కోట్లాది రూపాయల వ్యయంతో రాజభవనాన్ని నిర్మించారు గాని రాజధాని వచ్చింది లేదు.. ముఖ్యమంత్రి వచ్చింది అంతకంటే లేదు. అదో పెద్ద హంగామా..మించి డ్రామా..!
అలాంటి డ్రామానే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో కూడా గత ప్రభుత్వం హయాంలో నడిచింది. అప్పటికే శంకుస్థాపన జరిగిన స్ధలంలో మరోసారి శంకుస్థాపన అని చెప్పి అట్టహాసం చేసి జగన్ సర్కార్ విమానాశ్రయాన్ని 2024 లోపే పూర్తి చేసేస్తుందన్న హడావిడి చేశారు. జరిగింది సున్నా..!
ఇప్పుడు అసలు కథ మొదలైనట్టుంది..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న గురువారం నాడు విమానాశ్రయం పనులపై సమీక్ష జరిపి రెండేళ్లలో నిర్మాణం పూర్తయి ప్రయాణీకులకు అందుబాటులో ఉండేలా ప్రణాళిక సిద్ధం చెయ్యాలని ఆదేశాలు జారీ చేసారు. విమానాశ్రయం నిర్మాణంతో పాటు భోగాపురం నుంచి శ్రీకాకుళానికి నాలుగు లేన్ల రోడ్డు..అటు విశాఖకు ఆరు లేన్ల రోడ్డు నిర్మాణం చెయ్యాలని సంకల్పించారు. ఇవన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే.. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి మహర్దశ పట్టినట్టే..!
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా ఈ ప్రాంతానికి చెందిన వారే గనక.. ఆయన మంచి జోరు మీద ఉండే నాయకుడు గనక ఇక విమానాశ్రయంపై ఉత్తరాంధ్ర ప్రజలు గట్టిగానే ఆశలు పెట్టుకోవచ్చు..!
ఇదే ప్రాంతానికి చెందిన అశోక్ గజపతిరాజు ఇదే మోడీ సర్కారులో ఇదే కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు స్థల సేకరణ..శంకుస్థాపన జరిగింది. మళ్ళీ ఇదే ప్రాంతానికి చెందిన రామ్మోహన్ నాయుడు హయాంలో పూర్తయితే అంతకంటే కావలసింది ఏముంటుంది..!