పవన్ చెప్పులు ఎలా పోయాయో చెబుతున్న భీమవరం ఎమ్మెల్యే!

ఈ రోజుతో పవన్ వారాహి యాత్ర తొలివిడత షెడ్యూల్ పూర్తవ్వబోతోంది. ఈ రోజు రాత్రి జరగబోయే భీమవరం సభ అనంతరం పవన్ వారాహి వాహనానికి రెస్ట్ ఇవ్వబోతున్నారు. పైగా గత రెండు మూడు రోజులుగా భీమవరం నియోజకవర్గానికే కేటాయించిన పవన్… స్థానికంగా ప్రజలను కులాల వారీగా కలుస్తున్నారు. ఈ సమయంలో పవన్ పై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, గడిచిన ఎన్నికల్లో పవన్ పై గెలిచిన గ్రంధి శ్రీను తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ సెటైర్లు వేశారు.

ఏపీలో పవన్ వారాహి యాత్రలో ఎంటరైన అనంతరం పవన్ ఒక్క చెప్పు చూపిస్తే మాజీ మంత్రి పేర్ని నాని… రెండు చెప్పులూ చూపించారు. అనంతరం సభలో తన చెప్పులు పోయాయంటూ పేర్నిపై పవన్ సెటైర్ వేశారు. అనంతరం స్పందించిన పేర్ని నాని… చెప్పులు పోతే ఎవరొక నిర్మాత కొనిస్తాడు.. ఇబ్బంది లేదు.. కానీ, పార్టీ సింబల్ పోయింది దాని గురించి ఆలోచించు అంటూ సెటైర్ వేశారు.

అనంతరం ఆ వ్యవహారం సద్దుమణిగింది. పవన్ కు సరైన కౌంటర్ పడితే ఆ విమర్శ విషయం పవన్ సైలంట్ అయిపోతారనే చర్చకు బలం చేకూరింది. ఈ సమయంలో మరోసారి పవన్ చెప్పుల టాపిక్ తెరపైకి తెచ్చారు. పవన్ చెప్పులు ఎక్కడ పోయాయో అడ్రస్ చెబుతున్నారు.

అవును… పవన్ ప్యాకేజీ కోసం చంద్రబాబు ఇంటికి వెళ్లినప్పుడు బయట చెప్పులు వదిలి వెళ్లారని.. అయితే ప్యాకేజీ అనంతరం ఆ చెప్పులు వీది గుమ్మం వద్ద ఉన్నాయన్న విషయం మరిచిపోయి దొడ్డిగుమ్మం వైపు నుంచి ప్యాకేజ్ తో ఎవరూ చూడకుండా పారిపోయారని అన్నారు. సో.. చంద్రబాబు ఇంటివద్ద వైతికే పవన్ చెప్పులు కనిపిస్తాయని గ్రంధి శ్రీను ఎద్దేవా చేశారు.

అనంతరం తాజాగా జగన్ పై స్పందించిన పవన్… జనసేన సంచార వయోజన విద్యాకేంద్రంలో సీఎం కి తెలుగు భాష నేర్పిస్తానన్న అన్నారు. దీనిపై సైతం స్పందించిన గ్రంధి శ్రీను… పవన్ కల్యాణ్‌ ని ఎల్కేజీలో చేర్పిస్తామని, దానికి వయసు నిబంధన సడలిస్తూ జీవో ఇవ్వాలని తాను సీఎం జగన్ ని అభ్యర్థిస్తానని సెటైర్ వేశారు. దీంతో ఎప్పుడూ సైలంట్ గా ఉన్నట్లు కనిపించే శ్రీను… పవన్ పై డోసు పెంచినట్లే అని, ఇక ఎన్నికల ప్రచారాల్లో ఇది పీక్స్ కి చేరే ఛాన్స్ ఉందని అంటున్నారు పరిశీలకులు.

అనంతరం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేసినా ఎవరినీ మోసం చేయలేదని చెప్పిన గ్రంధి శ్రీను… తమ్ముడు పవన్ మాత్రం టీడీపీతో సహజీవనం చేస్తున్నారని విమర్శిస్తూ… అడుగడుగునా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో భీమవరం వేదికగా మరోసారి వైసీపీ వర్సెస్ జనసేన రాజకీయ విమర్శలు వేడెక్కాయని తెలుస్తుంది. మరి ఈ రోజు తన వారాహి యాత్ర చివరి సభలో పవన్ వీటిపై స్పందిస్తారా.. లేక, ఇప్పటికే ప్రిపేర్ అయిన అంశాలపైనే ప్రసంగిస్తారా అన్నది వేచి చూడాలి.