జగన్ ని సచివాలయం స్టాఫ్ దెబ్బేసినట్లేగా?

నిరుద్యోగ సమస్య గురించి ఎప్పుడు ఎవరు ప్రశ్నించినా… “అధికారంలోకి రాగానే 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేశాం” అనే సమాధానం వైసీపీ నుంచి వస్తుంటుంది! గ్రామ, వార్డు సచివాలాయలను జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించారు. అందులో పనిచేసే ఉద్యోగులు తనను నమ్ముతారని బలంగా నమ్ముకున్నారు. వీరంతా గ్రాడ్యుయేట్సే కావడంతో… వీరి ఓట్లు మొత్తం తమకే పడతాయని వైకాపా నాయకులు భ్రమ పడ్డారు. కానీ.. జగన్ ఒకటితలిస్తే.. సవిచాలయం స్టాఫ్ మరొకటి తలిచారు.

అవును.. ఆంధ్రప్రదేశ్ లోని 13 ఉమ్మడి జిల్లాల్లో.. ప్రస్తుతం తొమ్మిది జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. జిల్లాలవారీగా లెక్క చూస్తే, తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఇంచుమించు 92,769 మంది సచివాలయ ఉద్యోగులుంటారు. వారితోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా వైసీపీకే నమ్మకంగా ఉంటారనేది ప్రభుత్వ అంచనా. సచివాలయ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు.. పట్టభద్రులైన వాలంటీర్లు, వారి కుటుంబ సభ్యులు… కలిసి వైసీపీకే ఓట్లు వేస్తే మూడుచోట్లా ఆ పార్టీయే గెలవాల్సిన పరిస్థితి! కానీ అలా జరగలేదు. వీరంతా గంపగుత్తగా వైసీపీకి ఓటువేయలేదు.

అంటే… జగన్ భావిస్తున్నది వేరు – వాస్తవంలో జరుగుతున్నది వేరన్నమాట! ఎందుకంటే… సచివాలయాలను ఏర్పాటు చేసింది, ఉద్యోగాలు సృష్టించింది జగనే కావొచ్చు కానీ… అంత మాత్రాన అందరూ వైసీపీకి మద్దతు తెలుపుతారని అనుకోకుండా.. ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ఇంతకు మించి పాఠం ఉండదు.

ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే… వైసీపీ నేతలు సైతం ఊహించని విధంగా టీచర్ల నియోజకవర్గంలో వైసీపీకి రెండు విజయాలు దక్కాయి. ఒకరకంగా టీచర్లే ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని అంతా భావించారు. ఉపాధ్యాయ సంఘాలకు – జగన్ సర్కార్ కి మధ్య చర్చలు ఫలించలేదనే కథనాలమధ్య… టీచర్లు జగన్ కి షకిస్తారని అంతా భావించారు. అయితే… ఇక్కడ ప్రైవేటు టీచర్ల ఓట్లు కూడా తోడవడం, ప్రభుత్వ టీచర్లలో కొంతమంది వైసీపీ అభ్యర్థికి మద్దతివ్వడంతో ఆ పార్టీకి రెండు స్థానాలు దక్కాయి. కానీ కచ్చితంగా తమవే అనుకున్న పట్టభద్రుల స్థానాలు మాత్రం షాకిచ్చాయి. దీంతో… గదిలో కూర్చుని చేసే ఆలోచనల ఫలితాలు వేరు – జనాల్లోకి వచ్చి తీసుకునే నిర్ణయాల ఫలితాలు వేరని జగన్ కు అర్ధం అయ్యి ఉంటుందంటున్నారు విశ్లేషకులు!