ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాష్ట్ర ఆర్థిక స్థితి, అభివృద్ధి లక్ష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ హామీల అమలు, పథకాలపై స్పష్టత ఇవ్వడమే కాకుండా, గత ప్రభుత్వ తీరును తప్పుపట్టడం గవర్నర్ ప్రసంగంలో ప్రత్యేకంగా నిలిచింది.
గవర్నర్ ప్రకటన ప్రకారం, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లడం గత ప్రభుత్వ పాలనలోని ఆడంబర వ్యయాలు, లెక్కలేని అప్పులే కారణమని చెప్పడం గమనార్హం. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించకపోవడం, పథకాల అమలులో జాగ్రత్తలేమి వల్ల రాష్ట్ర అభివృద్ధి స్థంభించిందని గవర్నర్ విమర్శించారు. పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం ఎక్కడ ఖర్చయిందో లెక్కే లేదని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ప్రజా సంక్షేమం, అభివృద్ధి వైపుగా దృష్టి సారించడం అని గవర్నర్ తెలిపారు. మహిళలు, బీసీలు, పేదలు, నిరుద్యోగులు వంటి వర్గాలకు అనుకూలమైన పథకాలు అమలు చేస్తూనే, రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతోందని గవర్నర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్లు, స్వచ్ఛమైన తాగునీరు, విద్యుత్తు, రహదారులు వంటి అంశాలను ప్రస్తావించారు.
గవర్నర్ ప్రసంగంలో కందుకూరి వీరేశలింగం పేరు ప్రస్తావించటం ఆసక్తి కలిగించింది. ప్రతి ఒక్కరిలో నైపుణ్యాలను వెలికితీసి, వారి జీవితాలను మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం వైపుగా ప్రభుత్వం ముందుకు సాగుతుందనే విశ్వాసాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు.
సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకుంటూ అభివృద్ధి చెందాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని గవర్నర్ ప్రసంగం ద్వారా తెలియజేశారు. కానీ, విపక్షాలు ఈ ప్రకటనలను కేవలం మాటలు, భవిష్యత్ హామీలుగా ఖండిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు, ఆర్థిక పునరుద్ధరణ ఎంతవరకు వాస్తవంగా ఫలితాలిస్తాయో చూడాల్సి ఉంది.