ఆంధ్ర ప్రదేశ్: పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తాజాగా ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనమైయ్యాయి. పంచాయతీ ఎన్నికల విషయంలో చట్టాలను గౌరవించకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట విని ఏకపక్షంగా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి హెచ్చరించారు. ఏ అధికారి అయినా చట్టాలకు అనుగుణంగా కాకుండా నిమ్మగడ్డ ఆదేశాల మేరకు పని చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. సదరు అధికారులను గుర్తుపెట్టుకొని బ్లాక్ లిస్టులో పెడతామని పేర్కొన్నారు.
అంతేకాకుండా నిమ్మగడ్డ మాట విని ఎన్నికలలో అక్రమాలకు పాల్పడితే వారిపై కూడా మార్చి తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులకు వైసీపీ మంత్రి వార్నింగ్ ఇచ్చారు. ఏకగ్రీవమైన పంచాయతీల్లోని అభ్యర్థులకు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అలా కాదని రిటర్నింగ్ అధికారులు నిమ్మగడ్డ ఆదేశాలు పాటిస్తే వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం బ్లాక్ లిస్ట్ లో ఉండటం గ్యారెంటీ అని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలకు నిమ్మగడ్డ ఆదేశాలు జారీచేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తన నివాసం నుంచి బయటకు రాకుండా కట్టడి చేయాలని సూచిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్కు శనివారం లేఖ రాశారు. తాజా పరిణామాలతో మంత్రి పెద్దిరెడ్డి వార్నింగ్ తో పాటు నిమ్మగడ్డ ఆదేశాలు తో అటూ ఇటూ కాకుండా మధ్యలో ప్రభుత్వ అధికారులు నలిగిపోతున్నారు.