కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను ప్రభుత్వం కూల్చేసింది. భారి బందోబస్తుతో బుధవారం తెల్లవారాజామున వేదిక దగ్గరకు చేరుకున్న సిఆర్డీఏ ఉన్నతాధికారులు కూల్చివేతను ప్రారంభించారు. కూల్చివేతను అడ్డుకునేందుకు తమ్ముళ్ళు ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు.
చంద్రబాబునాయుడు ఎంతో మనసుపడి నర్మించుకున్న ప్రజావేదిక కూల్చివేతకు వ్యతిరేకంగా ఓ పిటీషనర్ కోర్టులో కేసు కూడా వేశారు. నిర్మాణం అక్రమమా ? సక్రమమా ? అన్న విషయాన్ని ప్రశ్నించిన కోర్టుకు అక్రమమే అని సమాధానం ఇచ్చారు. మరి అలాంటపుడు అక్రమ నిర్మాణాన్ని కూల్చేయటంలో మీ అభ్యంతరం ఏమిటని కోర్టు నిలదీసింది.
పిటీషన్ ఏమీ సమాధానం చెప్పలేకపోవటంతో కూల్చివేతల విషయం జోక్యం చేసుకోవటానికి కోర్టు నిరాకరించింది. దాంతో సిఆర్డీఏ ఉన్నతాధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. 2014లో అధికారంలోకి రాగానే కరకట్టపైన ఉన్న అనేక అక్రమ నిర్మాణాల్లో ఒకటైన లింగమనేని గెస్ట్ హౌస్ ను క్యాంపు ఆఫీసుగా ఎంచుకున్నారు. అంతేకాకుండా దాని పక్కనే ప్రభుత్వంతోనే మరో అక్రమ కట్టడం కట్టించి ప్రజావేదిక అని పేరుపెట్టారు.
ఆ కట్టడాన్నే జగన్మోహన్ రెడ్డి ఇపుడు కూల్చివేతకు ఆదేశాలిచ్చారు. సిఎం స్వయంగా ఆదేశాలిచ్చిన తర్వాత అధికారులు అమలు చేశారు. దాంతో చంద్రబాబు కలలకోట కూలిపోయింది. కాకపోతే ప్రజావేదికతోనే కూల్చివేత ఆగిపోతుందా ? లేకపోతే లింగమనేని గెస్ట్ హౌస్ కు కూడా వెళుతుందా ? అన్నదే చూడాలి.