గోరంట్ల మాధవ్ వీడియో లీక్ వ్యవహారంలో టీడీపీ ‘పోరెన్సిక్’ రిపోర్ట్.!

అరరె, తెలుగుదేశం పార్టీ ఏదో ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకొచ్చిందే.! అధికార పార్టీ ఎంపీ గనుక, వైసీపీ ప్రభుత్వం నుంచి గోరంట్ల మాధవ్‌కి దాదాపుగా క్లీన్ చిట్ వచ్చేయాలి, వచ్చేసింది కూడా. ఒరిజినల్ వీడియో దొరికితే తప్ప, ఫోరెన్సిక్ చేయలేమని సాక్షాత్తూ పోలీస్ ఉన్నతాధికారి.. పైగా, ఎస్పీ వెల్లడించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.

సరే, రాజకీయాల్లో ఇవన్నీ కామన్. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద గతంలో విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగితే, దానిపై అప్పటి టీడీపీ చేసిన రాజకీయ ప్రకటన ఎంతలా జనానికి షాకిచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటికీ, ఇప్పటికీ ఏం తేడా వుందని.?

వైసీపీ ప్రభుత్వం నుంచి గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ఓ ప్రకటన వచ్చింది. దానికి కౌంటర్ ఎటాక్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఓ ఫోరెన్సిక్ రిపోర్టుని తీసుకుని. అమెరికాలోని ఎక్లిప్స్ అనే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో లీక్ వ్యవహారంపై ఫోరెన్సిక్ రిపోర్టుని టీడీపీ తెప్పించిందట.

‘అది ఫేక్ కాదు, ఒరిజినల్.. మార్ఫింగ్ జరిగిన వీడియో కాదు..’ అంటూ అమెరికాకి చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు ఇచ్చిందని టీడీపీ నేతలు పట్టాభి, వంగలపూడి అనిత తదితరులు చెబుతున్నారు. ‘ఇదిగో సాక్ష్యం, దీని ఆధారంగా ఎంపీ మీద చర్యలు తీసుకోవాలి.. కళంకితుడైన ఎంపీ, జాతీయ జెండా ఎగురవేయడానికి అనర్హుడు.. మహిళా లోకానికి వైసీపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి..’ అంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేసేశారు.

ఇదే వీడియోని వైసీపీ నేతలు ఏదన్నా ఫోరెన్సిక్ ల్యాబుకి పంపితే, ‘ఫేక్’ అని రిపోర్ట్ రావడం పెద్ద వింతేమీ కాదు. వ్యవస్థలు, సంస్థలు అలా తగలడ్డాయ్. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో లీక్ విషయంలో ఎంత రాజకీయ రాద్ధాంతం చేసినా ప్రయోజనం లేదు. అది నైతికతకు సంబంధించిన అంశం. రాజకీయాల్లో నైతికతకు చోటు లేని రోజులివి.