హాట్ టాపిక్: లెవెల్ చూపిస్తున్న బుచ్చయ్య!

ఏపీలో ఎన్నికల సందడికంటే ముందు టీడీపీ కార్యకర్తల మహానాడు సందడికి వేళయ్యింది. పైగా ఈసారి అధికారంలోకి రాకపోతే ఇక అటు నుంచి అటే అనే పరిస్థితులు ఇప్పుడు టీడీపీలో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రానిపక్షంలో ఆ పార్టీ పరిస్థితి ఏమిటన్నది అందరికంటే ఎక్కువగా చంద్రబాబుకే తెలుసు. వైఎస్ జగన్ లాంటి బలమైన నేతను ఎదుర్కొని పార్టీని లాగించడం చిన్నవిషయం కాదనేది టీడీపీ నేతలదందరికీ తెలుసు! ఈ సమయంలో క్యాడర్ లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చేందుకు “మహానాడు” వేదిక సిద్దమయ్యింది.

మే 27, 28 తేదీల్లో రాజమండ్రిలో నిర్వహించనున్న మహానాడుపై టీడీపీ గట్టి దృష్టి పెట్టింది. ఈ రెండు రోజులపాటు నిర్వహించనున్న మహానాడుకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 15 లక్షల మంది ప్రజలు వచ్చేలా టీడీపీ నేతలు శ్రమిస్తున్నారు. అయితే ఈ శ్రమంతా సీనియర్ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన భుజాలపైకి ఎత్తుకున్నారు. అవును… మహనాడు మొత్తం ఏర్పాట్లను, పూర్తి బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్నారు బుచ్చయ్య చౌదరి. ఈసమయంలో బుచ్చయ్య తన లెవెల్ చూపిస్తున్నారంటూ గోదారి జిల్లాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఒకసారి గతానికి వెళ్తే… ఒక సీనియర్ నేతగా గోరంట్లకు చంద్రబాబు ఏనాడు స్థాయి గౌరవం ఇచ్చింది లేదు. నిత్యం ఆయన్ని అవమానపరుస్తూనే ఉన్నారనే చర్చ తమ్ముళ్లలో నడుస్తుంటుంది. అయినా సరే పార్టీమీద ఉన్న ప్రేమతో బుచ్చయ్య చౌదరి ప్రతీసారీ తనను తాను తగ్గించుకుంటూనే వచ్చారు. అయితే తాజాగా తన ఇలాకాలో మహానాడు జరుగుతుండటంతో.. చంద్రబాబుకు సమానంగా, మరికొన్ని చోట్ల చంద్రబాబు ఫోటోలకు దీటుగా తన ఫోటోలను ఫ్లెక్సీల్లో వేయించారు.

సిటీ ఎంట్రన్స్ దగ్గరనుంచి మొదలు.. సభా ప్రాంగణం ఎంట్రన్స్ వరకూ ప్రతీ ఫ్లెక్సీల్లోనూ హుందాయైన డ్రెస్ లు ధరించి కొత్త లుక్ లో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసుకున్నారు. ఎంట్రన్స్ లో ఒకపక్క చంద్రబాబు, మరోపక్క లోకేష్ ల ఫోటోలు ఉంటాయని పలువురు భావించారు. లోకేష్ పాదయాత్ర చేస్తూ భవిష్యత్ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్న సమయంలో ఆమాత్రం ఆలోచన తప్పుకాకపోవచ్చు! అయితే బుచ్చయ్య మాత్రం ఒకపక్క చంద్రబాబు – మరో పక్క తన ఫోటోలు వేసుకున్నారు. తప్పదన్నట్లుగా లోకేష్, అచ్చన్నాయుడు ఫోటోలకు తాను అనుకున్నంత ప్రాధాన్యం ఇచ్చారు. అయినా కూడా తప్పులేదనేది బుచ్చయ్య అభిమానుల మాటగా ఉంది.

టీడీపీలో చంద్రబాబు సమకాలీకులు, అంతకుమించి సీనియర్లు ఉన్నారు. వారిలో బుచ్చయ్య ఒకరు. ఇంతకాలం ఆ స్థాయి గౌరవం బుచ్చయ్యకు ఏనాడూ దొరకలేదు. అయితే అవకాశం వచ్చింది.. తన లెవెల్ ఏమిటో ఒకసారి చూపిద్దాం అనుకున్నారో ఏమో కానీ… రాజమండ్రి మొత్తాన్ని తన ఫ్లెక్సీలతో నింపేశారు. చంద్రబాబుకు సమానంగా తనకూ ప్రధాన్యత ఇచ్చుకున్నారు. ఇప్పుడు గోదావరి జిల్లాల తమ్ముళ్లలో ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

అయితే దీనికి మరో కారణం కూడా ఉందని అంటున్నారు విశ్లేషకులు. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా పిఠాపురం తో పాటు రాజమండ్రి-2 ని కూడా జనసేన డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ స్థానంకోసం ఒక బలమైన వ్యక్తిని కూడా సిద్ధం చేసిందని తెలుస్తుంది. అదే జరిగితే ఈ సీటు జనసేనకు ఇవ్వడానికి బాబు వెనుకాడకపోవచ్చు. ఎమ్మెల్సీని చేస్తానని బుచ్చయ్యను అగౌరవ పరచొచ్చు. బుచ్చయ్య తన లెవెల్ చూపించడానికి ఇది కూడా ఒక కారణం అని అంటున్నారు విశ్లేషకులు. ఈ హడావిడి చూసిన తర్వాత బుచ్చయ్యకు సీటూ ఇవ్వనిపక్షంలో… కేడరే రివర్స్ అయ్యే ప్రమాధం ఉంది. మరి బుచ్చయ్య లెవెల్ ని బాబు అర్ధంచేసుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి!