ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో మళ్లీ పునాదులు వేయాలనే లక్ష్యంతో కొత్త దిశలో ముందడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంయుక్తంగా అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో గూగుల్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్. ఇటీవలే గూగుల్ ప్రతినిధులు రాజధాని పరిధిలో సందర్శన చేయడం, కొన్ని కీలక భూములను పరిశీలించడమే ఇందుకు మద్దతుగా మారింది.
తుళ్లూరు మండలంలోని అనంతవరం-నెక్కల్లు మధ్యలో ఉన్న 143 ఎకరాల భూమి గూగుల్ ప్రతినిధుల దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతానికి రవాణా సౌలభ్యం, గ్లోబల్ కనెక్టివిటీ, మౌలిక వసతులు బలంగా ఉండటంతో ఇది ప్రాజెక్ట్‌కు అత్యుత్తమ ఎంపికగా కనిపిస్తోంది. దీనిపై అధికారవర్గాలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి.
ఇక్కడ గూగుల్ గ్లోబల్ డేటా హబ్‌ను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైతే, ఇది అమరావతికి మాత్రమే కాదు, రాష్ట్రానికి కీలక మలుపుగా మారనుంది. వేలాది ఉద్యోగాల సృష్టి, ఐటీ రంగంలో ఉన్న యువతకు అవకాశాలు అనివార్యంగా పెరుగుతాయి. ముఖ్యంగా డేటా సెంటర్ల విస్తరణ, డిజిటల్ సేవల అభివృద్ధికి ఇది బలం చేకూర్చనుంది.
ప్రస్తుతం చర్చలు తుదిదశలో ఉన్నాయని తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన రావచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ దొరికితే, అమరావతిలో గూగుల్ అడుగుపెట్టడం రాష్ట్ర అభివృద్ధికి కొత్త గమ్యాన్ని చాటుతుంది.