కవిత దత్తత గ్రామం కందకుర్తికి శుభవార్త

ఎంపీలు దత్తతకు తీసుకున్న గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఇక నుంచి ఎంపీలు దత్తతకు తీసుకున్న గ్రామాలకు ఉచిత వైఫై అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన ఏర్పాట్లు పూర్తయ్యాయని త్వరలోనే ఎంపీలు దత్తతకు తీసుకున్న గ్రామాల్లో ఈ సౌకర్యాలు కల్పిస్తామని ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న గ్రామాలకు ఫ్రీ వైఫై అందిస్తామని మంత్రి మనోజ్ సిన్హా లోక్ సభలో చెప్పారు. ఇప్పటికే 25000 వేల వైఫై హాట్ స్పాట్ లు గ్రామాలకు పంపించామని తెలిపారు. భారత్ నెట్ ప్రాజెక్టు కింద అన్ని గ్రామాలకు నెట్ సౌకర్యం కల్పిస్తామని మంత్రి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిజామాబాద్ ఎంపీ కవిత దత్తత తీసుకున్న గ్రామం కందకుర్తి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఎంపీలందరూ సంసద్ ఆదర్శ్ యోజన పథకం కింద మూడు గ్రామాలను దత్తత తీసుకున్నారు. మొదటి విడతగా ఒక గ్రామం, రెండో విడతలో మరో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత మొదటి విడతలో రెంజల్ మండలం కందకుర్తి గ్రామాన్ని దత్తతకు  తీసుకున్నారు. ఈ గ్రామానికి చాలా గొప్ప చరిత్ర ఉంది.

కందకుర్తి గ్రామం గోదావరి నది పక్కన ఎత్తైన గుట్టల మధ్య ఉంది. ఈ గ్రామంలో 4000 మంది ప్రజలు ఉంటారు. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు గోదావరి  పక్కనే ప్రవహిస్తున్నా ఇక్కడి గ్రామస్థులకు తాగేందుకు నీటి కటకటే ఉంది. మహారాష్ట్ర సరిహద్దున ఉన్న ఈ గ్రామం వద్దనే త్రివేణి సంగమం ఉంది. మూడు నదులు ఈ గ్రామంలోనే కలుస్తాయి. అందుకే దీనిని త్రివేణి గట్టు, త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. ఈ ఊరిలో ఉన్న శివాలయం రాముడు నిర్మించినట్టుగా చరిత్ర ఉంది. అంతటి గొప్ప చరిత్ర ఉన్న ఈ గ్రామానికి కనీసం బస్సు సౌకర్యం కూడా లేదు. గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు ఈ గ్రామానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ గ్రామంలో ప్రభుత్వం పుష్కర ఘాట్ కూడా ఏర్పాటు చేసింది. అయితే కవిత దత్తత తీసుకున్న తర్వాత ఈ గ్రామం కాస్త అభివృద్దికి నోచుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కందగట్టు  గ్రామానికి ఫ్రీ వైఫై రాబోతుంది. దీంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కవిత కందగట్టుతో పాటుగా తన పార్లమెంట్ పరిధిలోని ఆర్మూరు మండలం మాణిక్ బండా, జగిత్యాల మండలం అంతర్గామి గ్రామాలను కూడా దత్తత తీసుకున్నారు.