ఇది కలిసొచ్చే అంశం… టెక్కిలిలో అచ్చెన్నకు గుడ్ న్యూస్!

టెక్కిలి అసెంబ్లీ నియోజకవర్గం.. పెద్దగా పరిచయం అవసరం లేని స్థానం. 1983 నుంచి మొదలు వరుసగా ఇక్కడ టీడీపీ జెండా ఎగురుతూనే ఉంది. 1983, 85, 89, 94, 95 (బైపోల్స్), 99 లలో వరుసగా ఇక్కడ పసుపు జెండా రెపరెపలాడింది. అయితే ఈ పరంపరకి బ్రేక్ వేస్తూ… వైఎస్సార్ హయాంలో 2004, 2009 ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరింది. వైఎస్సార్ మరణానంతరం జరిగిన 2014, 2019 ఎన్నికల్లోనూ తిరిగి ఇక్కడ పసుపు జెండానే గెలిచింది.

ఇలాంటి ఈ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా జెండా ఎగరేయాలని వైసీపీ తహతహ లాడుతుంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జెండా పాతాలని తపిస్తుంది.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నకు ఓటమి రుచి చూపించాలని ప్లాన్‌ చేస్తోంది. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గిర గిరా తిరగడంతో మంగళగిరిలో దెబ్బతిన్నప్పటికీ.. టెక్కలిలో మాత్రం సైకిల్ కి బ్రేక్ పడలేదు.

అయితే ఈసారి ఎలాగైనా ఆ కోరిక తీర్చుకోవాలని.. అచ్చెన్నను అసెంబ్లీ గేటు తాకనివ్వకూడదని అధికార వైసీపీ బలంగా ఫిక్సయ్యిందని తెలుస్తుంది. అయితే… ఇక్కడ వైసీపీలో ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్, గ్రూపు రాజకీయాలూ ఈసారి వైసీపీ కోరికను తీరనిచ్చేలా లేవని అంటున్నారు. ఫలితంగా… టెక్కలిలో మరోసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయమని చెబుతున్నారు.

ఈ సమయంలో ఇక్కడ జగన్ ప్రత్యేక దృష్టిపెట్టి.. సమస్యలను పరిష్కరించనిపక్షంలో.. అచ్చెన్నా హ్యాట్రిక్ ఖాయమని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ఇక్కడ వైసీపీలో నాలుగు గ్రూపులు ఉన్నాయి. అందులో ఇన్‌ చార్జ్ దువ్వాడ శ్రీనివాస్‌ ది ఓ గ్రూప్‌ అయితే.. ఆయన భార్య వాణిది మరోగ్రూప్‌ కావడం గమనార్హం. ఇక కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి.. కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేడాడ తిలక్‌ ఆధ్వర్యంలో మరో రెండు గ్రూపులు ఉన్నాయి.

వాస్తవానికి… గత ఎన్నికల్లో టెక్కలి నుంచి పోటీచేసిన తిలక్‌ ను ఈసారి శ్రీకాకుళం లోక్‌ సభ సమన్వయకర్తగా నియమించారు జగన్. ఇదే సమయంలో… టెక్కలి ఇన్‌ చార్జిగాగా దువ్వాడ సతీమణి వాణికి టెక్కలి సీటు ఇస్తామని ప్రకటించిన సీఎం జగన్‌.. ఏమైందో ఆమెను తప్పించి మళ్లీ ఎమ్మెల్సీనే దువ్వాడనే టెక్కలి ఇన్‌ చార్జిగా నియమించారు. ఈ సమయంలో దువ్వాడతో మిగిలిన ఎవరికీ సఖ్యత లేదనే మాటలు వినిపిస్తున్నాయి.

పైగా… భార్యాభర్తల మధ్యే ఈ విషయంలో సఖ్యత కొరవడిందని చెబుతున్నారు. దీంతో… ఈ విషయం అచ్చెన్నకు అద్భుతంగా కలిసివచ్చేలా కనిపిస్తుందని అంటున్నారు పరిశీలకులు. ఫలితంగా… అచ్చెన్నాకు టెక్కలి నుంచి హ్యాట్రిక్ విజయం ఖాయమని చెబుతున్నారు. మరి ఈ సమస్యలపై జగన్ దృష్టిపెడతారా.. లేక, అచ్చెన్న నెత్తిన పాలుపోస్తారా అనేది వేచి చూడాలి!!