ప్రభుత్వ రంగంలో అందరికి ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితి ఉండడంతో ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సిద్దమైంది. మరో భారీ ఉద్యోగ మేళాకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి 2, 9, 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించనున్నారు. ‘అడ్వాంటేజ్ కెరీర్ ఎక్స్ పో’ పేరుతో మెగా ఉద్యోగమేళాలు నిర్వహించనున్నట్టు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తెలిపింది. కాగా, గత నెల 23, 24 తేదీల్లోనూ మెగా ఉద్యోగ మేళాలు నిర్వహించింది.
రెండో తేదీన ఫార్మా, హెల్త్ కేర్, మెడికల్, లైఫ్‌సైన్స్ రంగాలకు చెందిన 150కిపైగా సంస్థలు మేళాలో పాల్గొననున్నాయి. బీఎస్సీ, బీఫార్మసీ, ఇంటర్, ఎంఎస్సీ, ఎంఫార్మసీ చేసిన అభ్యర్థులు మేళాకు హాజరుకావొచ్చు. అలాగే, 9న ఐటీ, ఎలక్ట్రానిక్స్, టెలీ కమ్యూనికేషన్స్, బీపీవో, ఆటోమొబైల్, కన్‌స్ట్రక్షన్ రంగాలకు సంబంధించిన సంస్థలు మేళాలో పాల్గొంటాయి. చివరిగా ఈ నెల 16న జరగనున్న మేళాలో సెక్యూరిటీ సర్వీసెస్, లాజిస్టిక్స్, బ్యాంకింగ్ తదితర రంగాలకు సంబంధించిన సంస్థలు పాల్గొంటాయి.
నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేషన్ పేర్కొంది. మరిన్ని వివరాలకు https://www.apssdc.in/home/AdvantageAP వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది.