చైనా నుండి కరోనా మహమ్మారి దావానలంగా ప్రపంచం మొత్తం వ్యాప్తి చెంది, సమస్త మానవ జాతిని ముప్పు తిప్పలు పెడుతూ దొరికిన వారిని దొరికినట్టుగా పొట్టన పెట్టుకుంటూ దేశ స్థితి గతులని అస్తవ్యస్తం చేస్తున్న తరుణంలో జాతి సంరక్షణకై అన్ని దేశాలు ఎక్కడిక్కడ లాక్ డౌన్ లు పెట్టి కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయటానికి ప్రయత్నించాయి. దాని వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదాయం అంతంత మాత్రమే సమకూరింది. ఇలాంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి ఒక శుభవార్త తెలిసింది. ప్రభుత్వాలు చేసే తప్పుల్ని ఎండగడుతూ బయట పెట్టే కాగ్ వెల్లడించిన గణాంకాల్ని చూసి వైసీపీ ప్రభుత్వం ఆనందోత్సవాల్లో మునిగిందట. దేశం మొత్తంలో ఏపి మాత్రమే ఆ ఘనత సాధించిన రాష్ట్రమట.
గత ఆర్థిక సంవత్సరానికి గాను వసూలైన ఆదాయం రూ.63వేల కోట్లు ఉండగా తాజా ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.66708 కోట్లు వసూలయ్యాయట. అప్పటి బడ్జెట్ అంచనాల్లో అది కేవలం 35 శాతం కాగా.. ప్రస్తుత ఏడాది అంచనాల్లో 41 శాతం మేర సాధించారు. అంటే.. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే దాదాపు 3700 కోట్ల రూపాయిలు అధికంగా ఉండటం శుభ పరిణామంగా చెప్పాలి. ఎందుకంటే.. కరోనాతో ప్రభుత్వాలు కిందా మీదా పడుతున్నప్పుడు.. ఆదాయం గతానికి మించి రావటం శుభ సంకేతంగా చెప్పాలి.రాష్ట్రానికి కేంద్రం సాయంగా ఇచ్చే గ్రాంటుతో పాటు పన్నులు, పన్నేతర రూపాల్లో వచ్చే మొత్తాన్ని రెవెన్యూగా లెక్క కడతారు. ఇందులో జీఎస్టీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం, అమ్మకపు పన్ను, కేంద్ర పన్నుల్లోని వాటా, భూమి పన్ను, ఎక్సైజ్ ఆదాయం వంటివి కలిపి ఉంటాయి.
ఆదలా ఉండగా ప్రభుత్వం చేసే ఖర్చు ఆదాయంతో పోలిస్తే అంతకంతకూ పెరిగిపోతూ ఉండటం ప్రభుత్వాన్ని కలవర పెడుతుందట. దీనికి కారణం విరివిగా వివిధ వర్గాల వారికి అందిస్తున్న సంక్షేమ సాయంగా చెప్పాలి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంగా వివిధ పన్నుల రూపంలో వచ్చేవే. అంతేకాదు.. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు.. తీసుకొచ్చే అప్పుల్ని లెక్కలోకి తీసుకోరు.కరోనా ప్రభావంతో 2020లో 68 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. జనజీవనం స్తంభించడంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. రాష్ట్ర బడ్జెట్‌ను అంచనాల మేరకు ఖర్చు చేయగలిగితేనే ప్రణాళిక బాగున్నట్లు పరిగణిస్తారు.2019-20 ఆర్థిక సంవత్సరంలో నవంబరు నాటికి రూ.93629 కోట్లు ఖర్చు చేస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబరు నాటికి చేసిన ఖర్చు ఎంతో తెలుసా… అక్షరాల రూ.114198 కోట్లు. అంటే.. 2019 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2020 ఆర్థిక సంవత్సరంలో నవంబరు వరకు ఖర్చు చేసిన మొత్తమే రూ.21వేల కోట్లకు పైనే ఉంది. 2019 ఏప్రిల్ నుంచి నవంబరు వరకు రూ.34,996.29 కోట్లు రుణం తీసుకోగా 2020 ఏప్రిల్-నవంబర్ మధ్య రూ.73,811.85 కోట్లు అప్పు చేసింది. అంటే ఏపీ ఆదాయం కన్నా వ్యయమే ఎక్కువగా ఉందట.