Good Bye to YSRCP : వైఎస్సార్సీపీకి గుడ్ బై.. కానీ, ఎందుకు.?

Good Bye to YSRCP : రెండున్నరేళ్ళకే సీన్ మారిపోయింది. నిజానికి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచే అనూహ్యంగా వ్యతిరేకత పెరిగిపోయింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద. ఇసుక సమస్య సహా అనేక అంశాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను పెంచుతూ వచ్చాయి. విపక్షాలు దుష్ప్రచారం చేశాయా.? అధికార పక్షమే ప్రజా వ్యతిరేకతను గుర్తించలేకపోయిందా.? అన్న విషయాల్ని పక్కన పెడితే, జరగాల్సిన నష్టమైతే జరిగిపోయింది.

స్థానిక ఎన్నికల్లో గెలిచేశాం, తిరుపతి అలాగే బద్వేలు ఉప ఎన్నికల్లో సత్తా చాటేశాం.. విపక్షాలకు అస్సలు సీన్ లేదు.. అని అధికార పక్షం ఇంకా కళ్ళకు గంతలు కట్టేసుకుని, ‘ఆల్ ఈజ్ వెల్’ అనుకుంటోంది. జిల్లాల విభజనతో అధికార పార్టీకి సెగ నేరుగా తాకుతోంది. ‘వైఎస్సార్సీపీకి ఇక సెలవు.. జిల్లాల విభజన వంచనకు నిరసనగా బరువెక్కిన హృదయాలతో..’ అంటై వైఎస్సార్సీపీ జెండా రంగుల్ని పోలిన రంగులతో ఫ్లెక్సీలు కట్టి మరీ వైసీపీ శ్రేణులు, తమ పార్టీకి ‘గుడ్ బై’ చెప్పేస్తున్నారు.

రాయచోటి వద్దు, రాజంపేట ముద్దు.. అన్నది ఒక్కటే ప్రస్తుతానికి హైలైట్ అవుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో నర్సాపురం – భీమవరం చిచ్చు కూడా ఇలాగే వుంది. అటు మదనపల్లిలోనూ పరిస్థితి ఇంతే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోనూ అధికార పార్టీలో అసంతృప్తి సెగలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ భిన్నమైన పరిస్థితులు ఏమీ లేవు. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిథులే, జిల్లాల విభజన పట్ల సంతృప్తిగా లేరు. కానీ, వారెవరూ అధిష్టానాన్ని ధిక్కరించే పరిస్థితి లేదు. అలాంటివాళ్ళెవరికీ వారి వారి నియోజకవర్గాల్లో గౌరవమూ లభించడంలేదు.

ఓ వైపు ఉద్యోగుల ఆందోళనలు, ఇంకో వైపు జిల్లాల లొల్లి.. వెరసి, అధికార పార్టీకి ఇదొక అగ్ని పరీక్షే. ‘బైబై బాబూ..’ అంటూ జనం చేత గతంలో అనిపించిన వైఎస్సార్సీపీ, ఇప్పుడు ‘బైబై జగన్..’ అని తమ పార్టీ శ్రేణులతోనే అన్పించుకోవాల్సి వస్తుండడం శోచనీయమే.