హమ్మయ్య.. జనసేన ‘గ్లాసు’ భద్రం.!

జనసేన పార్టీకి ‘గుర్తు’ టెన్షన్ తొలగిపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం, ‘గ్లాసు’ గుర్తు విషయంలో జనసేన పార్టీకి స్పష్టతనిచ్చింది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులంతా, గ్లాసు గుర్తు మీదనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేయొచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపినట్లుగా జనసేన పార్టీ ప్రకటించింది.

ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్ర ఎన్నికల సంఘానికి థ్యాంక్స్ చెబుతూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 2019 ఎన్నికల్లో గ్లాసు గుర్తుతో పోటీ చేసిన జనసేన పార్టీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటుని గెలుచుకున్న సంగతి తెలిసిందే. గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా, వైసీపీలోకి దూకేశారు ఆ తర్వాత.

పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమిని చవిచూశారు. కాగా, శాశ్వత ఎన్నికల గుర్తు కావాలంటే, అవసరమైనంత ఓట్ల శాతం జనసేనకు లభించలేదు. ఈ క్రమంలో జనసేన పార్టీని ‘ఎన్నికల గుర్తు’ ప్రతిసారీ ఇబ్బంది పెడుతోంది.

సాధారణంగా, ఎన్నికల గుర్తు విషయమై రాజకీయ పార్టీలు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటాయి. జనసేన పార్టీకి అలాంటి వ్యూహాల విషయంలో తగినంత అనుభవం లేదు, దానికి తోడు పూర్తిస్థాయి నిర్లక్ష్యం కూడా.!

రాష్ట్రంలో పలు ఉప ఎన్నికలు జరిగాయి. మిత్రపక్షం బీజేపీకే పలు ఉప ఎన్నికల్ని జనసేన వదిలేసింది. ఆయా ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేసి వుంటే, పార్టీ బలాన్ని కాస్తో కూస్తో చూపించుకునేందుకు అవకాశం వుండేది గెలుపోటములతో సంబంధం లేకుండా.

ఎటూ, టీడీపీతో కలిసే నడవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ టీడీపీ మద్దతు తీసుకుని ఒక్క ఉప ఎన్నికలో అయినా, జనసేన పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టి వున్నా.. అది జనసేనకు ఉపయోగపడేదేమో.! సరే, అదంతా వేరే చర్చ.

వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులంతా టీడీపీ నుంచే పోటీ చేస్తారంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలో, గ్లాసు గుర్తు.. పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకీ పార్టీ పట్ల కొంత నమ్మకాన్నిచ్చిందని చెప్పొచ్చు.