మార్గదర్శిలో అవకతవకలు… తెరపైకి ఘోస్ట్ సబ్ స్క్రైబర్స్!

మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ లో అవకతవకలు జరిగాయంటూ ఏపీ సీఐడీ విచారణ సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే రామోజీరావు, శైలజా కిరణ్‌ ను హైదరాబాద్‌ లో వారి నివాసంలో సీఐడీ అధికారులు విచారించారు. ఈ సమయంలో చిట్‌ ల కింద సేకరించిన సొమ్మును రామోజీ గ్రూప్‌ కంపెనీలకు మళ్లించినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో ఇటీవల మార్గదర్శి సంస్థకు చెందిన ఆస్తులను సీఐడీ అటాచ్‌ చేసిన సంగతి తెలిసిందే. మార్గదర్శికి సంబంధించిన మొత్తం రూ.798.50 కోట్ల విలువైన చరాస్తులు ఏపీ సీఐడీ అటాచ్‌ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ సీఐడీ అదనపు డీజీపీ ఎన్‌ సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా… సీఐడీ విచారణపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు రాస్తున్నారని సీఐడీ అడిషినల్ డీజీ మండిపడ్డారు. మార్గదర్శి పెద్ద కుంభకోణమని.. చాలా నిబంధనలు అతిక్రమించిందని తెలిపారు. ఇదే సమయంలో మార్గదర్శి మోసాలపై ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఇదే సమయంలో మార్గదర్శి మోసాలపై ఇప్పటికే ఐటీ, ఈడీలకు సమాచారమిచ్చామని తెలిపిన అడిషినల్ డీజీ… కోటికి పైగా చిట్స్‌ వేసిన బాధితులు 800 మందికి పైగా ఉన్నారని తెలిపారు. పైకి రూల్స్‌ అన్నీ సక్రమంగా పాటిస్తున్నామని చెబుతూ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక, 40 శాతం చిట్‌ గ్రూపుల్లో చందాదారులే లేరని తెలిపిన ఆయన… కంపెనీనే సొంతంగా చిట్స్‌ ను తీసుకుంటోందని సంచలన విషయాలు వెల్లడించారు.

అవును… గోస్ట్‌ సబ్‌ స్క్రైబర్స్‌ పేరుతో కంపెనీనే చందాదారులు కట్టిన డబ్బులు తీసుకుంటోందని తెలిపిన సంజయ్… మార్గదర్శిలో అక్రమాలపై కవర్‌ చేసుకుంటూ ఈనాడు పత్రికలో రాసుకుంటున్నారని మండిపడ్డారు. మేము రాసిందే కరెక్ట్‌ అన్న ధోరణిలో రామోజీ, శైలజా కిరణ్‌ లు ఉన్నారని.. అందుకే ప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తున్నామని తెలిపారు.

ఇదే క్రమంలో మార్గదర్సిలో చిట్స్‌ కడుతున్నట్లు దాదాపు మూడు వేల మందికి తెలియనే తెలియదని తెలిపిన సంజయ్… ఈ మేరకు వంద మంది ఘోస్ట్‌ సబ్‌ స్క్రైబర్స్‌ ను గుర్తించి విచారించినట్లు తెలిపారు. ఈ విచారణలో ఘోస్ట్‌ సబ్‌ స్క్రైబర్స్‌ కు తెలియకుండా వారి ఆధార్, ఇతర వివరాలని మార్గదర్శి వాడుకుంటోందని సంచలన ఆరోపణలు చేశారు.

దీంతో తవ్వేకొద్దీ బయటపడుతున్నట్లుగా ఉన్న మార్గదర్శి వ్యవహారంపై తాజాగా ఏపీ సీఐడీ అదనపు డీజీపీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఘోస్ట్ సబ్ స్క్రైబర్స్ అనే అంశం తెరపైకి రావడంతో… మరెన్ని కొత్త కొత్త విషయాలు వెల్లడవుతాయో చూడాలని అంటున్నారు!