గంటా పరిస్థితి ఇలా అయిపోయిందేంటి చెప్మా.!
మునిసిపల్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైసీపీలో చేరిపోయినా బావుండేది.. ఇప్పుడు ఎటూ వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది.! ఇదీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురించి ఆయన అభిమానుల్లో బయల్దేరిన ఆందోళన. వైసీపీతో మంతనాలు జరిపారట.. బీజేపీతోనూ సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నించారట.. జనసేనానిని ప్రసన్నం చేసుకునేందుకు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో రాయబారం పంపాలనుకున్నారట.. కానీ, ఏం లాభం.? ఏ ప్రయత్నమూ ఫలించలేదట గంటా శ్రీనివాసరావు విషయంలో.
మునిసిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి.. వైసీపీ సత్తా చాటింది. టీడీపీ, జనసేన, బీజేపీ.. ఇలా అన్ని పార్టీలూ చేతులెత్తేశాయి. ‘మా పార్టీలోకి గంటా రాబోతున్నారు..’ అని విజయసాయిరెడ్డి చెప్పినప్పుడే, ‘మహా ప్రసాదం’ అని వుంటే బావుండేదేమో గంటా శ్రీనివాసరావుకి. విజయసాయిరెడ్డి మీద నీలగడం ద్వారా గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఎటూకాకుండా పోయారు రాజకీయంగా.
త్వరలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. విశాఖ ఉక్కు కోసమంటూ రెండు సార్లు రాజీనామా చేసేసిన గంటా, అసెంబ్లీ సమావేశాల్లోనే తన రాజీనామాకి ఆమోదం లభించేలా చేసుకుంటానని అంటున్నారు. కానీ, అందుకు అధికార వైసీపీ సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు. ఎందుకంటే, టీడీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. వారిపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌ని టీడీపీ ఇప్పటికే కోరిందాయె. ఆ వ్యవహారంపై చర్యలు తీసుకోకుండా గంటా రాజీనామాని స్పీకర్ ఆమోదించకపోవచ్చు.. అన్నది ఓ రాజకీయ విశ్లేషకుడి అంచనా. ఏమో, ఏం జరుగుతుందోగానీ, పాపం గంటా పరిస్థితి రాజకీయంగా అత్యంత అధ్వాన్న స్థితికి చేరిపోయిందిప్పుడు.