Gautam Sawang Transferred : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ‘నమ్మకస్తుడైన’ పోలీస్ ఉన్నతాధికారిగా గౌతమ్ సవాంగ్ పేరు తెచ్చుకున్నమాట వాస్తవం. మరి, అలాంటి గౌతమ్ సవాంగ్ అనూహ్యంగా రాష్ట్ర డీజీపీ పదవి నుంచి బదిలీ అవడమేంటి.?
పోలీస్ బాస్ అంటే, పోలీస్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో అత్యున్నత కిరీటం. చంద్రబాబు హయాంలో గౌతమ్ సవాంగ్ నీతి నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనంగా, సమర్థతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. అలాంటి గౌతమ్ సవాంగ్, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతూనే డీజీపీగా అవకాశం దక్కించుకోవడం అప్పట్లో చర్చనీయాంశమయ్యింది.
చాలా సందర్భాల్లో పోలీసు వ్యవస్థ న్యాయస్థానాల నుంచి మొట్టికాయలు తినాల్సి వచ్చినా, డీజీపీ సైతం పలు కేసుల్లో న్యాయస్థానాలకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చినా, డీజీపీ గౌతమ్ సవాంగ్ తన పని తాను చేసుకుపోయారు. డీజీపీగా తన పదవీ కాలంలో గౌతమ్ సవాంగ్ ఎదుర్కొన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు.
కానీ, ప్రతిసారీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, గౌతమ్ సవాంగ్ విషయంలో అండగా నిలుస్తూ వచ్చారు. అయితే, ఇటీవల ఉద్యోగులు తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం తర్వాత సీన్ మారిపోయింది. పోలీసు వ్యవస్థ వైఫల్యం వల్లనే, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు విజయవాడకు తరలి రాగలిగారన్నది వైసీపీలో అంతర్గతంగా జరిగిన చర్చ.
కాగా, తన పదవి ఊడిపోతుందని తెలిసీ, విశాఖ శారదాపీఠం వెళ్ళిన గౌతమ్ సవాంగ్ అక్కడ ప్రత్యేక పూజలు చేయించి, ముఖ్యమంత్రిని ప్రసన్నం చేయించుకునేందుకు ప్రయత్నించారంటూ ఓ ప్రచారం జరుగుతోంది. ఇలాక్కూడా జరుగుతుంటుందా.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఏమో, అసలిలాంటి అనుమానాలకు ఎలా ఆస్కారమేర్పడుతోందో.!