విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర నిర్ణయం వెనక్కి తీసుకునేంతవరకు పోరాడతానని టీడీపీ నగర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘గతంలో 95 శాతం ప్రభుత్వ రంగంలో ఉంటే కేవలం 5 శాతం మాత్రమే ప్రైవేటు పరంగా ఉండేవి. ప్రస్తుతం ఈ సంఖ్య తారుమారైంది. దీనిని వంద శాతం చేయాలని కేంద్రం చూస్తోంది. భూములిచ్చిన వారిలో ఇప్పటికీ ఎంతో మందికి ఉద్యోగం రాలేదు. ఉద్యోగం ఇవ్వకపోగా సంస్థనే ప్రైవేటు పరం చేస్తారా? పరిశ్రమతో విశాఖ వాసులందరికీ సంబంధం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కేంద్రాన్ని ఒప్పించాలనేదే మా ప్రయత్నం’ అని అన్నారు.
పల్లా శ్రీనివాసరావు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ మంత్రి బండారు సంఘీభావం తెలిపారు. పల్లా శ్రీనివాసరావు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి గంటా అన్నారు. తన రాజీనామా విషయంలో కూడా వివాదాస్పదం చేయాలని చూస్తున్నారని ఆయన చెప్పారు. ‘‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చిత్తశుద్ధితో చేసిన రాజీనామా. విశాఖ జర్నలిస్ట్ ఫోరం సాక్షిగా నా లెటర్ యాడ్ ఇస్తాను. కావాల్సింది రాసుకుంటే… నేను సంతకం చేస్తా.’’ అని గంటా అన్నారు. ఇదే సందర్భంలో మాజీ మంత్రి బండారు మాట్లాడుతూ “విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని” అన్నారు. ఉక్కు శాఖ మంత్రి… పోస్కోతో ఒప్పందం చేసుకున్న వ్యవహారాన్ని పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టారన్నారు. ప్రజలను మభ్య పెట్టకుండా అసలు విషయం బయటకు చెప్పాలని బండారు ప్రశ్నించారు.