“మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అంటూ ముద్దాడుతుంటారు… తాను చేయని పనులను కూడా తానే చేశానని… హైటెక్ సిటీకి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే… చంద్రబాబు చేశారని చెప్పుకుంటుంటారు. ఇలా తాను చేయని పనులను సైతం తానే చేసినట్లు చెప్పుకోవడంలో ఆయన దిట్ట.. “అంటూ గతంలో కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… మరోసారి ఈ కామెంట్ ను వైరల్ చేసే పనిలో పడ్డారు వైకాపా కార్యకర్తలు!
తాజాగా టీడీపీ నేతలు మొదలుపెట్టిన సెల్ఫీ ఛాలెంజ్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. వెనకా ముందూ చూడకుండా… మంత్రులుగా పనిచేసినవారు సైతం చరిత్ర మరిచి అసత్యాలు ప్రచారం చెసుకునే పనిలో పడ్డారు. ఏ టైం లో ఏపార్టీలో ఉన్నది సరిగా గుర్తులేకో చేశారో.. లేక, కావాలనే ఫేక్ ప్రమోషన్ చేసుకోవాలని ఆశించారో తెలియదు కానీ… చంద్రబాబు చేయని పనిని… బాబే చేశారంటూ అసత్య ప్రచారానికి తెరలేపి… ఒక సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు గంటా శ్రీనివాస రావు!
సెల్ఫీ ఛాలెంజ్ పేరుతో ఓ పోస్టు పెట్టిన ప్రస్తుత టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు… ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్ ఎదుట సెల్ఫీ దిగి.. “టీడీపీ హయాంలో ఇలాంటివి ఎన్నో అద్భుత భవనాలు నిర్మించాం.. వైఎస్స్సార్ సీపీ హయాంలో ఒక్కటైనా నిర్మించారా..” అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే ఈ భవన నిర్మాణంలో అసలు వాస్తవాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు బయటపెట్టారు. గంటా చెప్పింది అవాస్తవమని తేల్చిచెప్పారు.
“ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్ కు 14 ఏళ్ల కిందటే బీజం పడింది. భవిష్యత్ అవసరాల కోసం భారీ సీటింగ్ సామర్ధ్యంతో ఓ అధునాతన కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం అప్పటి వీసీ ఆచార్య బీలా సత్యనారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి నిర్ణయించారు. దాదాపు రూ.10 కోట్లతో కన్వెషన్ సెంటర్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈ భవన నిర్మాణం తొలి దశ పనులకు శంకుస్థాపన చేశారు” అని ఏయూ అధికారులు క్లారిటీ ఇచ్చారు.
దీంతో మైకందుకున్న వీఎంఆర్డీయే చైర్ పర్సన్, వైఎస్సార్ సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల… గంటా శ్రీనివాస్ పై నిప్పులు చెరిగారు. గంటా శ్రీనివాసరావుకు మతి భ్రమించిందని.. అందులో భాగంగానే ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేస్తున్నారని ఆమె మండిపడుతూ… దీనికి సంబంధించిన ఒరిజినల్ ఫోటోను విడుదల చేశారు. దీంతో… పైన చెప్పుకున్న కేసీఆర్ కామెంట్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు!