ఏపీలో విడుదలవుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలు ఒక్కసారిగా అధికారపార్టీలో కుదుపు తీసుకురాగా… ప్రతిపక్షాల్లో కొత్త జోష్ తీసుకొస్తున్నాయి! సంక్షేమంలో ఫుల్ మార్కులు తెచ్చుకుంటున్నా.. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముందుకుపోతున్నా… నిరుద్యోగ సమస్య, అభివృద్ధిపై దృష్టిపెట్టడం లేదనే విమర్శలు గ్రాడ్యుయేట్స్ లో బాగా ప్రభావం చూపించాయి. ఫలితంగా పట్టభద్రులు జగన్ కు షాకిస్తున్నారు. అయితే ఈ విషయంలో పవన్ మాట నిజమైందనే కామెంట్ చేస్తున్నారు టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు!
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ హవా కొనసాగిస్తోంది. టీడీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంలో కొనసాగుతున్న క్రమంలో టీడీపీ నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయదుంధుబి సాగించానికి ఈ ఎన్నికలు ఓ శుభపరిణామం అంటూ టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పలు సభల్లో “వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను” అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తున్నారు గంటా.
చతుర్ముఖ పోటీ కొనసాగినా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడ చీలిపోలేదని.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపదెబ్బ అని.. ఫలితంగా పవన్ మాట నిజమైందని అంటున్నారు. అయితే విశాఖే రాజధాని అని పదే పదే చెప్పే జగన్.. ఇక తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతున్నానని ఇక జులై నుంచి పాలన విశాఖ నుంచే జరుగుతుందని తాజగా కూడా ప్రకటించారు. అయినా కూడా ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఇలాంటి తీర్పివ్వడం ఇప్పుడు చరనీయాంశం అయ్యింది!
ఇక ఇదే సమయంలో… తాజా ఫలితాలపై స్పందించారు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. “ఇది వైసీపీ ప్రభుత్వానికి గొడ్డలిపెట్టు.. ఇక టీడీపీ విజయదుందుభి షురూ అయ్యింది” అంటూ బాలయ్య హర్షం వ్యక్తంచేశారు.