వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘గడప గడపకీ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాల్లో ఛీత్కారాలు ఎదురవుతున్న వైనం అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలకు వెళ్ళేందుకు తటపటాయిస్తున్నారు. అయినాగానీ, జనం వద్దకు వెళ్ళకపోతే, వచ్చే ఎన్నికల్లో సీట్లు తిరిగి ఇవ్వడం జరగదంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అల్టిమేటం జారీ చేశారు. ఏయే ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు సరిగ్గా వెళ్ళడంలేదో లిస్టు తీసి మరీ, వారికి ఎప్పటికప్పుడు సమీక్షల సమయంలో క్లాసులు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
తాజాగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో 20 మంది ఎమ్మెల్యేల పనితీరు ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం విషయమై సరిగ్గా లేదంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసహనం వ్యక్తం చేశారు. వచ్చే సమీక్షా సమావేశానికి ఆ లోటుపాట్లను సరిదిద్దుకుని, జనం వద్దకు వెళ్ళాలని వైఎస్ జగన్ ఆదేశించారు.
కానీ, గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో బాధ్యతాయుతంగా పాల్గొంటున్న ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం ఎమ్మెల్యేలలో సగం కూడా వుండదన్నది అంతటా వినిపిస్తున్న వాదన. అయితే, అన్ని విషయాల్నీ అధికార పార్టీ పైకి చెప్పలేదు కదా.? ఆయా నియోజకవర్గాల్లో జనం తమ సమస్యల్ని ఏకరువు పెడుతున్న దరిమిలా, గడప గడపకూ ఎమ్మెల్యేలు వెళ్ళాలంటే కష్టంగా మారుతోంది. అధినేత ఆదేశాలకు భయపడి వెళ్ళినా, వెళ్ళాక జనంతో గొడవలు పెట్టుకోవాల్సి వస్తోంది ఎమ్మెల్యేలకి.