అమరావతి.! ఆ కథ మళ్ళీ మొదలైంది.!

ఓ అంతర్జాతీయ పత్రిక ఏదో, భవిష్య నగరాల పేర్లలో అమరావతిని కూడా చేర్చింది. మొత్తం ఆరు నగరాలు.. అందులో అమరావతి కూడా ఒకటి.! నిజానికి గొప్ప విషయమే ఇది.! మెక్సికో సహా పలు దేశాల్లోని ‘ఫ్యూచర్ సిటీస్’ని ఇందులో పేర్కొన్నారు. మామూలుగా అయితే, గర్వ పడాల్సిన సందర్భం.

కానీ, వాస్తవ కోణంలో చూస్తే.. అమరావతిని కేవలం ఓ పబ్లిసిటీ స్టంట్‌గానే పరిగణించాల్సి వస్తుంది. చంద్రబాబు హయాంలో అమరావతి ‘ప్రాజెక్టు’ ప్రారంభమయ్యింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి.? అన్న కనీసపాటి విజ్ఞత లేకుండా డిజైన్ చేయబడిన ప్రాజెక్ట్ ఇది. ‘సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు’గా పేర్కొంటూ, అమరావతిలోని భూముల విషయమై పెద్ద మ్యాజిక్ చేశారు.

సరే, వైసీపీ హయాంలో ఆ అమరావతిలో ఒక్క ఇటుక కూడా అదనంగా పేర్చలేకపోవడం పెద్ద ‘పాపం’.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు. చిన్నదో పెద్దదో రాష్ట్రానికి రాజధాని అయితే అవసరం. అది అమరావతి అవుతుందా.? ఇంకోటవుతుందా.? అన్నది వేరే చర్చ. ఒక్కటి చాలదు, మూడు రాజధానులంటోంది వైసీపీ.

మూడు సరే, ముందైతే ఒక్కటైనా పూర్తవ్వాలి కదా.? అన్నదీ సబబే. వైసీపీ – టీడీపీ గొడవ మధ్య అమరావతి నాశనమైపోయిందన్నది కాదనలేని వాస్తవం. రెండోసారి కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయి వుంటే, అమరావతిని పూర్తి చేసేసేవాళ్ళా.? అంటే, చెప్పలేం.! ఎందుకంటే, అమరావతికి నిధులు కావాలి.. కేంద్రం ఇవ్వదు.!

పోలవరం పరిస్థితి ఏమయ్యిందో చూస్తున్నాం. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టుని కేంద్రం పూర్తి చేయడంలేదు. క్రెడిట్ రాష్ట్రానికి దక్కకూడదన్నది కేంద్రం దురాలోచన.! అమరాతి విషయంలోనూ అంతే.! ఫ్యూచర్ సిటీ అమరావతి.. దానికసలు భవిష్యత్తే లేదిప్పడు.!