కాంగ్రెస్‌లో మరో వికెట్ పడింది. కేంద్ర మాజీమంత్రి, కర్నూలు మాజీ లోక్‌సభ సభ్యుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాజీనామా చేసిన ప్రకంపనలు ఇంకా తగ్గకముందే.. మరో సీనియర్ పార్టీని వీడారు. విభజన తరువాత కాంగ్రెస్ పార్టీలో మిగిలిన పోయిన అతి కొద్దిమంది సీనియర్లలో ఆయనా ఒకరు. ఉత్తరాంధ్ర రాజకీయాలపై మంచి పట్టు ఉన్న సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ పార్టీని వీడబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
సీనియర్లు తాము రాజకీయాల్లో ఉండాలంటే కాంగ్రెస్‌లో కొనసాగలేకపోతున్నారు. విభజన చోటు చేసుకున్న అయిదేళ్ల తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగు పడలేదు. ఇలాంటి తరుణంలో రాజకీయాల్లో కొనసాగడమా? సన్యసించడమా? అనేదే వారి ముందు ఉన్న మార్గాలు.
రాజకీయాల్లో కొనసాగాలంటే కాంగ్రెస్‌లో ఉంటే సాధ్యపడదనుకుంటున్న నాయకులు దశాబ్దాలుగా పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీల వైపు చూస్తున్నారు. కిశోర్ చంద్రదేవ్ కూడా అదే జాబితాలో చేరారు. తన రాజకీయ భవిష్యత్తు ఏమిటనే విషయాన్ని ఆయన త్వరలోనే మీడియాకు తెలియజేస్తారనే టాక్ ఉత్తరాంధ్రలో వినిపిస్తోంది.
రేపో, మాపో ఆయ పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయట. ఏ పార్టీలో చేరతారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. తెలుగుదేశంతో టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. విశాఖపట్నం జిల్లా అరకు లోక్‌సభ స్థానానికి ఆయన ప్రాతినిథ్యం వహించారు. మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో కిశోర్ చంద్రదేవ్ పనిచేశారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.
2009లో అరకు లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అరకు నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించింది. కాంగ్రెస్‌తో కిశోర్ చంద్రదేవ్‌కు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆ పార్టీ తరఫున అయిదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
ఓ దఫా రాజ్యసభకూ ప్రాతినిథ్యం వహించారు. 1979లోనే అఖిల భారత కాంగ్రెస్‌కు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఘనత కిశోర్ చంద్రదేవ్‌కు ఉంది. 1980, 1984, 2004 ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. 1994 నుంచి 2000 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.