ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి అరకులోయలో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసిన మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ అడ్రస్ లేకుండా పోయారు. శ్రవణ్ ఎక్కడున్నారో పార్టీ నేతలకు కూడా తెలియటం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన ఇప్పటికి 5 వారాలు దాటినా పార్టీ మండలస్ధాయి నేతలతో కనీసం ఒకసారి కూడా శ్రవణ్ సమావేశం కాలేదు.
నిజానికి శ్రవణ్ కు ఎన్నికల్లో పోటీచేసి గెలిచేంత సీన్ లేదని అందిరికీ తెలుసు. ఫిరాయింపు ఎంఎల్ఏ, తండ్రయిన కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో సానుభూతిని క్యాష్ చేసుకుందామన్న ఆలోచనతోనే ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్న శ్రవణ్ కు చంద్రబాబునాయుడు టికెట్ ఇచ్చారు.
అప్పటి వరకూ శ్రవణ్ కు నియోజకవర్గానికి సంబంధం లేనేలేదు. శ్రవణ్ మంత్రయిన ఆరు మాసాలోపే ఎన్నికలు వచ్చాయి. చంద్రబాబు మీదున్న వ్యతరేకత వల్ల ఎన్నికల్లో శ్రవణ్ మూడోస్ధానంతో సరిపెట్టుకోవాల్సొచ్చింది. అప్పటి నుండి నియోజకవర్గంలో ఎవరికీ కనబడలేదు. ఎవరితోను మాట్లాడలేదు. చివరకు పార్టీ నాయకత్వంతో కూడా టచ్ లో లేరు.
ఈ పరిస్ధితి ఓక్క విశాఖపట్నంలోని అరకు నియోజకవర్గంలో మాత్రమే కాదు. చాలా జిల్లాల్లోని ఎన్నో నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో వైసిపి దెబ్బకు టిడిపి గూబగుయ్యిమన్నది. దాంతో చాలామంది ఓడిపోయిన అభ్యర్ధులు ఎక్కడా చడీచప్పుడు చేయకుండా ఉండిపోయారు. మొత్తానికి టిడిపిలో ఏదో ముసలం వచ్చేట్లే కనబడుతోంది. అదేంటో మొదలయ్యే వరకూ అర్ధంకాదేమో ?