టీడీపీకి మాజీమంత్రి రాజీనామా… జనసేన కంచుకోటకు భారీ బీటలు!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా పలు కారణాలతో పార్టీలు మారుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మంత్రి సైకిల్ దిగిపోయారు. దీంతో ఇప్పుడు ఈ విషయం అటు టీడీపీలోనే కాదు ఇటు జనసేనలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈయన రాజీనామాతో కోనసీమ జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో తమ్ముళ్లు, జనసైనికులు తలలు పట్టుకున్నారని తెలుస్తుంది.

వచ్చే ఎన్నికల్లో సత్తా చాటి ఎలాగైనా సరే వైఎస్ జగన్ ని గద్దె దించాలని టీడీపీ – జనసేన కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే విడి విడిగా పోరాడి జగన్ ని కొట్టడం ఆల్ మోస్ట్ అసాధ్యం అని భావించారో ఏమో కానీ… పొత్తు పెట్టుకున్నారు. ఈ సమయంలో ఇటీవల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు. అక్కడి నుంచి మొదలు… టీడీపీ, జనసేనల్లో పరిస్థితి కాకెత్తి పోతుంది. గ్రౌండ్ లెవెల్లో కేడర్ నిప్పులు కక్కుతున్నారు.

ఇందులో భాగంగా టీడీపీ కంచుకోటలు జనసేన ఖాతాలో వేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు… జనసేనకు 24 టిక్కెట్లు విదిల్చారంటూ జనసేన నేతలు నిప్పులు కక్కుతున్నారు. ఈ సమయంలో పలు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఎల గెలుస్తారో చూస్తామంటూ జనసైనికులు… జనసేన నేత ఎలా అసెంబ్లీకి వెళ్తాడో చూస్తామంటూ టీడీపీ తమ్ముళ్లు శపథాలు చేస్తున్నారు. ఈ సమయంలో టీడీపీ – జనసేనలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉభయ గోదావరి జిల్లాల్లోని కోనసీమలో పెద్ద షాక్ తగిలింది.

ఇందులో భాగంగా… టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ మాజీమంత్రి, సీనియర్ నేత, టీడీపీ స్టేట్ వైఎస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి సూర్యారావు ఒక లేఖను విడుదల చేశారు. ఇందులో భాగంగా 1981లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించి.. ఎన్టీఆర్, వైఎస్సార్ ల కేబినెట్ లో మంత్రిగా పనిచేసి.. టీడీపీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉన్న తనపేరు టీడీపీ తొలిజాబితాలో ప్రకటించకపోవడాన్ని అవమానంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని తెలిపారు.

కాగా… ఇటీవల టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల తొలిజాబితాలో గొల్లపల్లి పేరు లేదు. దీంతో ఆయన అనుచరులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అటు పి.గన్నవరంలో మహాసేన రాజేష్ కు టీడీపీ టిక్కెట్ కన్ ఫం చేయడం, మరోపక్క రాజోలు టిక్కెట్ జనసేనకు ఇవ్వబోతున్నారంటూ కథనాలు రావడంతో గొల్లపల్లిపై ఒత్తిడి పెరిగింది. ఇందులో భాగంగా టీడీపీలో గొల్లపల్లికి ఘోర అవమానం జరిగిందని, పార్టీకి రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో… గొల్లపల్లి ఆ పని పూర్తిచేశారు!

వాస్తవానికి గొల్లపల్లి టీడీపీకి రాజీనామా చేయడం వల్ల రెండు పార్టీలకూ రెండు నియోజకవర్గాల్లో పెద్ద దెబ్బ తగిలిందనే భావించాలి. పొత్తులో భాగంగా గొల్లపల్లికి రాజోలు టిక్కెట్ రాకపోయినా.. పి.గన్నవరం అయినా దక్కుతుందనే ఉద్దేశ్యంతో ఆయన రెండు నియోజకవర్గాలపైనా దృష్టి సారించారని అంటారు. దీంతో… ఆయనకు ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. పి.గన్నవరంలో గొల్లపల్లి పోటీ చేస్తే… రాజోలు లోని ఆయన అనుర్చరులంతా పార్టీలకు అతీతంగా తమకు సపోర్ట్ చేస్తారని జనసేన నేతలు భావించారు!

అయితే… వారెవరూ ఊహించని రీతిలో గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి రాజీనామా చేయడంతో అటు టీడీపీ కారకర్తలతో పాటు, జనసైనికులు తలలు పట్టుకున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ రెండు నియోజకవర్గాలను చేజేతులా ఫ్యాన్ కి అప్పగించేలా ఉన్నారనే కామెంట్లు ఆఫ్ ద రికార్డ్ చేస్తుండటం గమనార్హం. మరోపక్క పి.గన్నవరంలో మహాసేన రాజేష్ కు సపోర్ట్ చేసేది లేదని ఆ నియోజకవర్గంలోని జనసైనికులు నానా యాగీ చేస్తున్నారు! దీంతో.. ఒక్క రాజీనామాతో రెండు నియోజకవర్గాలు, రెండు పార్టీలూ విలవిల్లాడుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి!!