వైసిపిలోకి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు చేరారు. కొడుకు దాడి రత్నాకర్ తో కలిసి వీరభద్రరావు ఈరోజు లోటస్ పాండ్ లోని నివాసంలో జగన్మోహన్ రెడ్డిని కలిశారు. 2014లో ఎన్నికల నాటికి దాడి కుటుంబం వైసిపిలోనే ఉండేది. కొడుకు రత్నాకర్ అప్పట్లో వైసిపి తరపున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత అనేక కారణాల వల్ల వైసిపికి దూరమయ్యారు.
వైసిపికి దూరమైన తర్వాత డాది ఏ పార్టీలోను చేరలేదు. చేరలేదనేకన్నా దాడిని ఏ పార్టీ కూడా పెద్దగా పట్టించుకోలేదనటమే సబబుగా ఉంటుంది. ఎందుకంటే దాడి ఒకవిధంగా అవుట్ డేటెడ్ రాజకీయ నేత అనే చెప్పుకోవాలి. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆమధ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ దాడిని పార్టీలోకి ఆహ్వానించారు. అయితే దాడి మాత్రం చేరలేదు.
అప్పటి నుండి టిడిపిలోకి వెళ్ళాలా ? లేకపోతే తిరిగి వైసిపిలోనే చేరాలా ? అనే విషయమై మద్దతుదారులతో దాడి చర్చించారు. ఒకదశలో టిడిపిలో చేరటం ఖాయమని కూడా అనుకున్నారు. అయితే రెండు కారణాల వల్ల దాడి టిడిపిలో చేరే ఆలోచనను విరమించుకున్నారు. మొదటిది దాడి డిమాండ్ ను చంద్రబాబు పట్టించుకోకపోవటం. రెండోది తన బద్ధ శతృవైన మరో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టిడిపిలో చేరుతుండటం. పైగా కొణతాల కూడా అనకాపల్లి నేతే కావటం గమనార్హం. అందుకనే దాడి వేరేదారి లేక వైసిపిలో చేరారు.
ప్రస్తుత పరిస్ధితులను గమనిస్తే రాబోయే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపిగా దాడి వీరభద్రరావు పోటీ చేసే అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్రలో దాడి బాగా పాపులరైన నేతే. కానీ చాలా కాలంగా రాజకీయాల్లో ఎదురుదీతున్నారు. ఇపుడు వైసిపి లాంటి బలమైన పార్టీ అండ దొరికితే దాడి గెలవటం పెద్ద కష్టమేమీ కాదనే పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మరి దాడి సేవలను చంద్రబాబు ఏ విధంగా ఉపయోగించుకుంటారో చూడాల్సిందే.