మాజీ డిప్యూటి సీఎం దామోదర రాజనర్సింహ్మ సతీమణి పద్మినీ రెడ్డి బీజెపిలో చేరారు. బీజెపీ నేత మురళీదర్ రావు నాయకత్వంలో గురువారం పద్మినీ రెడ్డి బిజెపిలో చేరారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్వీస్ట్ ఏర్పడినట్టైంది. మోడీ నాయకత్వాన్ని నమ్మి పద్మినీ రెడ్డి బిజెపిలో చేరడాన్ని స్వాగతిస్తున్నట్టు మురళీధర్ రావు, లక్ష్మణ్ లు అన్నారు.
పద్మిని రెడ్డి కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటి సీఎం దామోదర రాజనర్సింహ్మ భార్య. పద్మినీ రెడ్డి చేరికతో కాంగ్రెస్ కు గట్టి షాక్ ఎదురైనట్టు చెప్పవచ్చు. దామోదర రాజనర్సింహ్మ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నారు. దీంతో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఏర్పడింది.
పద్మినీ రెడ్డి గత కొంత కాలంగా ఆధ్యాత్మిక రంగంలో కీలకంగా ఉంటున్నారు. రాజకీయ రంగంలోకి రావాలనే ఉద్దేశ్యంతో పద్మినీ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ ను సంప్రదించగా అక్కడ ఆమెకు భంగపాటు ఎదురైనట్టు తెలుస్తోంది. ఒక కుటుంబంలో ఒకరికే ప్రాధాన్యం అలాగే సంగారెడ్డి టికెట్ జగ్గారెడ్డికే అని తేల్చి చెప్పడంతో పద్మినీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకొని బిజెపిలో చేరారు. మోడీ విధానాలు నచ్చి పార్టీ మారుతున్నట్టు పద్మిని రెడ్డి అన్నారు. పద్మినీ రెడ్డి బిజెపిలో చేరడం కాంగ్రెస్ షాక్ కు గట్టి దెబ్బగా చెప్పవచ్చని పలువురు అంటున్నారు.
ఆంధోల్ నుంచి రాజనర్సింహ్మ పోటి చేయనున్నారు. అయితే పద్మినీ రెడ్డి సంగారెడ్డి బిజెపీ అభ్యర్దిగా పోటి చేయనున్నట్టుగా తెలుస్తోంది. సంగారెడ్డి లేదా పటాన్ చెరువు ఈ రెండిటిలో ఏదో ఒక స్థానం నుంచి పద్మినీ రెడ్డి పోటి చేస్తారని కీలక నేతలు తెలిపారు. దీని పై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. అప్పటి వరకు పార్టీ తరపున ప్రచార కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పద్మినీ రెడ్డి ప్రచారం చేస్తారని నేతలన్నారు.
దామోదర రాజనర్సింహ్మకు తెలియకుండా పద్మినీ రెడ్డి బిజెపిలో చేరరని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బుధవారం జరిగిన సభలోె పలు పెను మార్పులు జరుగుతాయి అని ప్రకటించిన 24 గంటల్లోపే మార్పు సంభవించింది. కాంగ్రెస్ పార్టీలో అలకగా ఉన్న నేతలందరిని బిజెపిలోకి ఆహ్వానించాలని బిజెపి నిర్ణయించినట్టుందని పలువురు అంటున్నారు. అందుకే మహాకూటమి అభ్యర్దుల ప్రకటన అయినాకనే తమ అభ్యర్దులను బిజెపి ప్రకటించేందుకు వ్యూహం రచించినట్టుగా తెలుస్తోంది. కీలక పార్టీ నేత భార్య తమ పార్టీలో చేరడంతో బిజెపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పద్మినీ రెడ్డి చేరికతో తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. సీట్ల సర్దుబాటు జరుగుతున్న వేళ ఒక కీలక నేత పార్టీని వీడటం పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. అన్న తమ్ములు వేరే పార్టీలో ఉండటం చూశాం, తండ్రి కొడుకులు వేరే పార్టీలో ఉండటం చూశాం కానీ భార్య, భర్తలు వేరు వేరు పార్టీలో ఉండటం ఫస్లు టైం చూస్తున్నామని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో అని అనుకుంటున్నారు. ఆంధోల్ నియోకజకవర్గంలో ప్రచారం చేయాల్సి వస్తే పద్మినీ రెడ్డి ఎలా వ్యవహారిస్తారో అని అంతా ఎదురు చూస్తున్నారు. భార్య భర్తలిద్దరూ వేరు వేరు పార్టీలో ఉండటంతో క్యాడర్ ఎవరికి సపోర్ట్ ఇస్తుందో అనే ప్రశ్న మొదలైంది. దామోదర రాజనర్సింహ్మ కూడా బిజెపిలో చేరుతారా అనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.
ఆంధోల్ నియోజకవర్గం నుంచి టిఆర్ ఎస్ టికెట్ ఆశించిన బాబు మోహన్ కూడా ఇటీవల బిజెపిలో చేరారు. బిజెపి బాబు మోహన్ కు ఆందోల్ టికెటు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి దామోదర పోటి దాదాపు ఖరారైంది. ఈ వేళ పద్మిని అక్కడ ప్రచారం చేస్తే పరిస్థితేంటని అంతా అనుకుంటున్నారు.