వైసిపిలోకి కేంద్ర మాజీ మంత్రి

అవును వైసిపిలో కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి జాయినవుతున్నారు. లోటస్ పాండ్ లోని నివాసంలో జగన్మోహన్ రెడ్డితో కిల్లి భేటీ అవుతున్నారు. సుమారుగా 11 గంటలకు కిల్లి, జగన్ భేటీ జరుగుతుందని సమాచారం. రాష్ట్ర విభజన సమయంలో కిల్లి కేంద్రమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కిల్లి రాజకీయ భవిష్యత్తు కోసమే వైసిపిలో చేరుతున్నారు. సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి జీవితం లేదని కిల్లికి బాగా అర్ధమైంది. నిజానికి కిల్లి వైసిపిలో చేరుతున్నారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. ఆ ప్రచారం ఇప్పటికి వాస్తవమవుతోంది.

వైసిపిలో చేరుతున్నారంటేనే జగన్ నుండి ఏదో హామీ తీసుకునే జాయినవుతున్నారన్న విషయం అందరికీ అర్ధమవుతోంది. ప్రస్తుతం శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గానికి దువ్వాడ శ్రీనివాస్ సమన్వయకర్తగా ఉన్నరు. రాబోయే ఎన్నికల్లో దువ్వాడే లోక్ సభకు పోటీ చేస్తారని అనుకుంటున్నారు. అలాంటిది ఇపుడు కిల్లి పార్టీలోకి వస్తుండటంతో సమీకరణలు మారే అవకాశం ఉంది. ఎందుకంటే కిల్లి కూడా పార్లమెంటు సీటుపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. అదే సమయంలో టెక్కలి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కూడా ఉందని సమాచారం.

తొందరలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కావూరి సాంబశివరావు కూడా వైసిపిలో చేరే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కావూరి బిజెపిలోనే ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో అంత చురుగ్గా లేరన్నది వాస్తవం. ఎటూ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వైసిపిలో చేరి ఏలూరు ఎంపిగా పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి కావూరి వైసిపిలో చేరి ఎంపిగా పోటీ చేస్తే ఇప్పటి వరకూ సమన్వయ బాధ్యతలు చూస్తున్న కోటగిరి శ్రీధర్ ఏమవుతారో చూడాలి. మొత్తానికి ఇటు టిడిపి నుండే కాక అటు కాంగ్రెస్, బిజెపి నుండి కూడా సీనియర్ నేతలు వైసిపి వైపే చూస్తున్నారంటే కారణం ఏమైవుంటుంది ?