రాజమండ్రి కేంద్రంగా వేమగిరి వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతున్న టీడీపీ మహానాడులో అతిధులను నోరూరించే వంటకాలు పలకరిస్తున్నాయి. గోదావరి రుచులు ఈ మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. మహానాడుకి విచ్చేస్తున్న అతిథులకి నోరూరించే వంటకాల్ని స్థానిక టీడీపీ నేతలు సిద్ధం చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలకి ముందు జరగబోయే మహానాడు కావడంతో పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తున్నారు.
సుమారు 15 లక్షల మంది వరకు ఈ మహానాడుకి రాబోతున్నట్లు టీడీపీ చెప్తోంది. సరే కాస్త అటు ఇటుగా వచ్చినా కూడా భోజనాల విషయంలో ఎలాంటి లోటు పాట్లూ జరగకుండా ఈ మేరకు వంటకాల్ని సిద్ధం చేయిస్తోంది. ఇందులో భాగంగా… సుమారు 1500 మంది వంటవాళ్లు దాదాపు 200 వంటకాల్ని అతిథుల కోసం సిద్ధం చేయబోతున్నారు. అదేవిధంగా వడ్డించడానికే 800 మందిని అరేంజ్ చేశారు.
శనివారం ప్రతినిధుల సభ సందర్భంగా… టిఫిన్ కింద ఇడ్లీ, వడ, మైసూర్ భజ్జీతో పాటు పునుగులు, టమాటా బాత్, పొంగల్, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్ రెడీ చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో వెజ్ బిర్యానీ, బంగాళదుంప కుర్మా, మామిడికాయ పప్పు, గోంగూర, గుత్తు వంకాయ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, సాంబారు, పెరుగు వడ్డించబోతున్నారు. అదనంగా కాకినాడ కాజా, యాపిల్ హల్వా కూడా అతిథులకి వడ్డించనున్నారు.