మస్ట్ రీడ్: పొత్తుపై ప్రభావం చూపించబోతున్న ఫ్లెక్సీ!

రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని, సింహం సింగిల్ గా వస్తుందని, తన పొత్తు ప్రజలతోనే అని వైఎస్ జగన్ సందర్భం వచ్చినె ప్రతిసారీ చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పొత్తుల ప్రస్థావన వైసీపీ ఏనాడూ తెచ్చింది లేదు. అయితే ఎన్నికలకు రోజులు దగ్గరవుతున్న వేళ… “ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను” అనే డైలాగుతో పొత్తుకు తెరలేపారు పవన్ కల్యాణ్. ఇప్పుడు ఇదే జనసైనికుల ఆగ్రహానికి పరోక్షంగా కారణం అయ్యిందని తెలుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా రచ్చకు దారితీస్తుందని తెలుస్తుంది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై “పాపం పసివాడు” అంటూ ఫ్లెక్సీ వేసింది జనసేన. దీంతో “ప్రజలకు తానున్నానంటూ జగన్ చెబుతున్నట్లు” ఉన్న ఫోటోలు వైసీపీ విడుదల చేసింది. ఈ సందర్భంలో “వైసీపీ నాయకులంతా జగన్ పల్లకి మోస్తున్నట్లు” జనసేన మరో కార్టూన్ విడుదల చేసింది. దీంతో “మేము మా నాయకుడి పల్లకే మోస్తాం.. ప్యాకేజీ తీసుకుని పక్క పార్టీ నాయకుడిది కాదు” అంటూ వైసీపీ నుంచి స్ట్రాగ్ కౌంటర్స్ పడ్డాయి. ఇదే సమయంలో “చంద్రబాబు – లోకేష్ ల పల్లకి మోస్తున్న పవన్” అంటూ మరో కార్టూన్ విడుదల చేసింది వైసీపీ.

ఇదే ఇప్పుడు జనసైనికుల ఆగ్రహానికి కారణం అవుతుంది. ఇందులో భాగంగానే మొన్న నెల్లూరు లో జరిగినా, నిన్న ఒంగోలులో జరిగినా, నేడు తాజాగా భీమవరంలో జరిగినా… పవన్ ను పల్లకి మోస్తున్నట్లు చూపించడంపైనే జనసైనికుల ఆగ్రహం. అయితే.. పవన్ స్థాయిని గుర్తుచేస్తూ, జనసైనికులను దెప్పిపొడుస్తూ వైసీపీ ఫ్లెక్సీలు వేస్తుందన్న విషయం కాసేపు పక్కనపెడితే… ఈ కార్టూన్ లో తప్పేముందనేది పలువురి అభిప్రాయంగా ఉంది. తనకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని, తాను సీఎం అభ్యర్థి స్థాయి వ్యక్తిని కాదని, చంద్రబాబుతో కలిసి ముందుకు వెళ్తానని పవన్ బహిరంగంగా చెప్పుకున్నారు.

దీంతో… “పవన్ కే లేనిది, జనసైనికులకు ఎందుకు” అనేది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్నగా ఉంది. పవన్ ఒంటరిగా రంగంలోకి దిగితే, బరిలోకి దిగి.. జగన్ పై బస్తీమే సవాల్ అన్నప్పుడు కూడా… వైసీపీ నాయకులు అలాంటి ఫ్లెక్సీలు వేస్తే అది తప్పు! అంతా ఆ విషయాన్ని తప్పు పట్టొచ్చు! కానీ… స్వయంగా పవనే… బాబు పల్లకి మోయాలని భావించినప్పుడు… జనసైనికులకు ఏమిటి మధ్యలో ఇబ్బంది అనేది మరో ప్రశ్న. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట జనసైనికులు!

వైసీపీ అంటుందని కాదు.. విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారని కాదు.. జనాలు ఎద్దేవా చేస్తున్నారని కాదు కానీ… అసలు జనసేన చంద్రబాబు పంచన ఎందుకు చేరాలి? ఒంటరిగా పోటీచేసి అధికారంలోకి రాకపోయినా… వచ్చినన్ని సీట్లు వచ్చినా… సొంతంగా కష్టపడి తెచ్చుకున్న తృప్తి ఉంటుంది.. వైసీపీ తర్వాత ప్రజలకున్న సెకండ్ ఆప్షన్ పవనే అనే మాట వస్తుంది కదా… సేనాని అలా ఎందుకు ఆలోచించడం లేదు అని ఆలోచనలో పడ్డారంట జనసైనికులు.

ఇప్పుడు పొత్తులో ఉండి గెలిచినా.. పవన్ అయితే సీఎం కారు. అలా కాకుండా… ఈసారి ఒంటరిగా పోటీచేసి, బలంగా నిలబడి, టీడీపీని సైతం దాటి ప్రధాన ప్రతిపక్షంగా నిలవగలిగితే… 2029 నాటికి ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు ఓన్లీ ఆప్షన్ అవుతాము కదా.. అని భావిస్తున్నారంట. దీంతో… తన అభిప్రాయాన్ని పవన్ కు పరోక్షంగా ఇలా ఫ్లెక్సీలు చింపుతూ… పవన్ ను తాము పల్లకి మోసే వాడిగా, పొత్తులకోసం ప్రాకులాడేవాడిగా చూడలేమనే సంకేతాలు పంపుతున్నారని తెలుస్తుంది.

మరి వీరి ఆత్మాభిమానం, ఆవేదన… అధినేతకు అర్ధమవుతాదా… ఆయన ఆలోచనా విధానాన్ని మార్చుతుందా అనేది వేచి చూడాలి! అలాకానిపక్షంలో… ఫ్లెక్సీలు చింపే పని ఇప్పట్లో పూర్తవ్వకపోవచ్చు!!