మినిస్టర్ కాకపోయినా క్యాబినెట్ ర్యాంకైనా దక్కించుకుంది

జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో బెర్త్ ఖాయమనే అనుకున్నారు  ఫైర్ బ్రాండ్ లీడర్ రోజాకు. కానీ తన మంత్రివర్గంలో జగన్ ఫైర్ బ్రాండ్ కు చోటు కల్పించలేదు. దాంతో ఆమె అలిగారు. సరే మొత్తానికి నాలుగు రోజుల బుజ్జగింపుల తర్వాత దారికొచ్చినట్లే కనిపించారు. అందుకే రోజాను ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపిఐఐసి) ఛైర్ పర్సన్ గా నియమించాలని నిర్ణయించారు.

నిజానికి ఐదేళ్ళుగా చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై రోజా తిరుగులేని పోరాటాలే చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి నేతలకు ధీటుగా స్పందించిన వైసిపి ఎంఎల్ఏల్లో రోజా కూడా ఒకరు. సమస్యలపై స్పందించటం, అనర్గళ వాగ్ధాటి, ఎటువంటి తడబాటు లేకుండా చంద్రబాబు అండ్ కోపై వేసే సెటైర్లతో రోజాకు ఫైర్ బ్రాండ్ లీడర్ అనే ట్యాగు తగిలించారు.

అభిమానులనే కాదులేండి చాలామంది రోజాకు మంత్రివర్గంలో చోటు ఖాయమనే అనుకున్నారు. రోజా కూడా అలాగే అనేసుకున్నారు. కానీ ఎక్కడో అదృష్టం వెంట్రుక వాసిలో తప్పిపోయింది.  దాంతో రోజాలో ఎక్కడో అసంతృప్తి మొదలైంది.  దాంతో రోజా అలిగిందన్న విషయం బహిరంగ రహస్యమే.

అందుకే జగన్ ఒకటికి రెండుమార్లు పిలిపించుకుని మాట్లాడారు. వాళ్ళ మధ్య చర్చలు ఏమి జరిగియో తెలీదు కానీ మొత్తానికి ఏపిఐఐసి ఛైర్మన్ గా నియమించాలని జగన్ నిర్ణయించుకున్నారట. అంటే ఛైర్ పర్సన్ గా బాధ్యతలు తీసుకోవటానికి రోజా కూడా సానుకూలంగా స్పందించిందనే అనుకోవాలి.  మొత్తానికి క్యాబినెట్లో బెర్త్ దక్కకపోయినా కనీసం క్యాబినెట్ ర్యాంకున్న పోస్టయినా దక్కించుకున్నది.