కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారోచ్.!

ఎట్టకేలకు కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిగొచ్చారు. అధిష్టానమే మొట్టికాయలు వేసిందో, లేదంటే మునుగోడులో గెలవడం కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవసరం వచ్చిందోగానీ.. కారణం ఏదైతేనేం, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణ చెప్పేశారు రేవంత్ రెడ్డి.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్న దరిమిలా, మునుగోడులో ఉప ఎన్నిక తప్పనిసరి కాగా, అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందు కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన వ్యూహాల్ని రచిస్తున్నారు.

అయితే, సోదరుడు రాజగోపాల్ రెడ్డి విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అటూ ఇటూ ఊగుతున్న విషయం విదితమే. ఎలాగైనా, కాంగ్రెస్ నుంచి తనను ఎవరో ఒకరు వెళ్ళగొట్టాల్సిందే.. అన్నట్లు వ్యవహరిస్తున్నారాయన. ఇంకోపక్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తోంటే, వాటిని తనకు ఆపాదించుకుంటున్నారు వెంకటరెడ్డి.

ఈ నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ నేతలు వెంకటరెడ్డి మీదా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేత అద్దంకి తయాకర్ ఇటీవల వెంకటరెడ్డిపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. అది రేవంత్ చేయించిన పనేనంటూ వెంకటరెడ్డి గుస్సా అయ్యారు. రేవంత్ తనకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి దిగొచ్చారు, క్షమాపణ కూడా చెప్పేశారు.

సో, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇరకాటంలో పడ్డారన్నమాట. కానీ, కింద పడ్డా పై చేయి తనదే అన్నట్లు వెంకటరెడ్డి వ్యవహరిస్తున్నారు. అద్దంకి దయాకర్‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నది వెంకటరెడ్డి డిమాండ్. ‘నన్ను సస్పెండ్ చేసినా ఫర్లేదు.. నేను ఆల్రెడీ క్షమాపణ చెప్పాను..’ అంటున్నారు అద్దంకి దయాకర్.

అయినా తగ్దేదే లే.. అని అంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ నేపథ్యంలో, ఈ వివాదం ఎక్కడిదాకా వెళుతుందో వేచి చూడాల్సిందే.